ఆడియో హిట్‌తో అంచనాలు పెరిగాయి

30 Jun, 2017 23:33 IST|Sakshi
ఆడియో హిట్‌తో అంచనాలు పెరిగాయి
ఆకలి పోరాటం చిత్ర నిర్మాత పీవీ రాఘవులు
రాజమహేంద్రవరం కల్చరల్‌ : రామ్‌సాయి గోకులం క్రియేషన్స్‌పై నిర్మించిన ‘ఆకలిపోరాటం’  సినిమాలోని ఆరు పాటలు హిట్‌ కావడంతో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయని నిర్మాత పీవీ.రాఘవులు(రవి) తెలిపారు. ఈ నెల 25న రాజమహేంద్రవరంలో విడుదల చేసిన ఆకలి పోరాటం ఆడియో విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్‌ శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆ వివరాలను తెలిపారు. ఈ సందర్బంగా హీరో గంగాధర్‌ మాట్లాడుతూ ఎంత పెద్ద సినిమాలో అయినా ఏవో కొన్ని పాటలు హిట్‌ అవుతాయని, అయితే చిన్న సినిమా అయిన తాను నటించిన ఆకలి పోరాటంలో ఆరు పాటలు ప్రజాదరణ పొందడం ఆనందంగా ఉందన్నారు. ఈ విజయం తమది మాత్రమే కాదని, గోదావరి ప్రాంత సెంటిమెంట్, ఇక్కడి ప్రజల ఆదరణే ఈ విజయానికి కారణమన్నారు. చిత్ర నిర్వాహకులు దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ సినిమాలో ఆరు పాటలు మంచి హిట్‌ అయ్యాయని, ఈ విజయం గోదావరి ప్రాంత వాసులదేనన్నారు. సినిమా విడుదలకు సిద్ధమౌతున్నామని, పాటలను విజయవంతం చేసిన మాదిరిగానే సినిమాను హిట్‌ చేయాలని ఆక్షాంక్షించారు. కొల్లపురెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యతో తెరకెక్కిన ఈ సినిమాను అందరూ ఆదరించాలని, ప్రస్తుతం యువత పడుతున్న కష్టాలను ఆకలి పోరాటం ద్వారా చూపామన్నారు. 
మరిన్ని వార్తలు