‘ఆగస్టు’ పైనే ఆశలు

31 Jul, 2016 22:43 IST|Sakshi
‘ఆగస్టు’ పైనే ఆశలు

 

  • కలవరపెడుతున్న ఖరీఫ్‌
  • కురవని భారీ వర్షాలు
  • ఇప్పటికీ నమోదుకాని సాధారణ వర్షపాతం
  • జిల్లాలో 4.34 హెక్టార్లలో పంటల సాగు విస్తీర్ణం
  • వర్షాలు కురవకపోతే ఆగమే అంటున్న రైతులు


జోగిపేట: రైతులను ఖరీఫ్‌ సీజన్‌ కలవరపెడుతోంది. జూన్, జూలై నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. జూలైలో చెప్పుదగ్గరీతిలో వర్షాలు కురవనేలేదనే చెప్పవచ్చు. రైతులు ఆగస్టులో కురిసే వర్షాలపైనే గంపెడాశలు పెట్టుకున్నారు. సరైన వర్షాలు పడగానే రైతులు నాట్లు వేయాలని, మరికొందరు విత్తిన పంటలను కాపాడుకోవాలని, ఇంకొందరు భూమి దున్ని విత్తనాలు విత్తాలని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వరుణదేవుడిపై ఆశతో పత్తి పంటలు వేసుకోవడం, వరినాట్లు వేసుకోవడం అక్కడక్కడా జరిగింది. అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మండలాల్లో వరినారు మళ్లు సిద్ధం ఉంచుకున్నారు.

గత ఖరీఫ్‌లో రైతులు 4.15 లక్షల హెక్టార్లలో పంటలను సాగు చేయగా వీటిలో 79వేల హెక్టార్ల వరకు వరి, చెరకు, పంటలు సాగు చేయగా, 3.35 లక్షల హెక్టార్లలో జొన్న, మొక్కజొన్న పత్తి, పొద్దుతిరుగుడు తదితర పంటలను సాగు చేశారు. ఈ  ఏడాది 4.34 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేసే అవకాశం ఉంది. జిల్లాలో  గత సంవత్సరం ఖరీఫ్‌లో  జూన్‌ మాసంలో 44.4 మిమీ, జూలైలో 108 ఎంఎం, ఈ సంవత్సరం ఖరీఫ్‌లో జూన్‌లో 137.7 మి.మీ, జూలైలో 206.6 మి.మీ సాధారణ వర్షపాతం నమోదయ్యింది.
రైతులకు పంపిణీ చేసిన విత్తనాలు
ప్రభుత్వం వివిధ పంటలకు సంబంధించి రైతులకు విత్తనాలను పంపిణీ చేసింది. 41,390 క్వింటాళ్ల వరి, 23,164 క్వింటాళ్ల మొక్కజొన్న, 12,804 క్వింటాళ్ల జొన్న, 489 క్వింటాళ్ల సజ్జలు, 2,402 క్వింటాళ్ల కంది, 3,771 క్వింటాళ్ల పెసర, 2,417 క్వింటాళ్ల మినుము, 19,898 క్వింటాళ్ల సోయాబిన్, 338 క్వింటాళ్ల వేరుశనగ, 43 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు, 47 క్వింటాళ్ల ఆముదం, 10.9 క్వింటాళ్ల నువ్వుల విత్తనాలు పంపిణీ చేశారు.

అన్ని మండలాల్లోనూ అదే తీరు...
జిల్లాలో గడిచిన రెండు నెలల్లో ఒక్కటి, రెండు  మండలాలు మినహా మిగతా మండలాల్లో  సాధారణ స్థాయి వర్షపాతం నమోదు కాలేదు. వారం రోజుల క్రితం నారాయణఖేడ్‌ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. జూన్‌ మాసం అటుంచి జూలైలో అప్పుడప్పుడు జిల్లాలోని నలువైపులా వర్షాలు కురిసినా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా కురవలేదని రైతుల అభిప్రాయం. పారిశ్రామిక ప్రాంతాల వైపు ఎక్కువగా వర్షం కురిసిందంటున్నారు. గ్రామాలల్లో కురిసిన వర్షాలు పంటలు విత్తే స్థాయిలో వానల్లేవనే చెప్పవచ్చు.

ఇప్పటికి వరి సాగు ప్రశ్నార్థకంగానే మారింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ అధికారులు పత్తి, సోయాబిన్‌ సాగు చేయవద్దని చెబుతున్నా ఇది వరకే పత్తి, కందులు వేసిన రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. గత ఏడాది జూలై, ఆగస్టు మాసాల్లో కూడా అనుకున్నంతగా వర్షాలు  మోస్తారుగా కురిసాయి.

ఖరీఫ్‌లో పంటల సాగు వివరాలు

                     
పంట                విస్తీర్ణం
                     ( హెక్టార్లలో)

వరి                       82206
చెరుకు                   21532
జొన్న                    10753
సజ్జలు                   292
మొక్కజొన్న            113490
పెసర                    24994
మినుము                13714
కంది                      26678
ఇతర ధాన్యాలు         735
వేరుశనగ                 38
పొద్దుతిరుగుడు          211
నువ్వులు                  306
ఆముదం                  303
పత్తి                      122436
మిర్చి                      652
ఉల్లి                        269
సోయాబిన్‌             15421

                           4.34.030



పంటలపై ఆశలు గల్లంతే...
జిల్లాలో ప్రధానంగా పత్తి , వరి సాగు చేస్తుంటారు. 80 శాతానికి పైగా రైతులు వర్షాధారంగానే సాగు చేస్తుంటారు. ఈ సారి వర్షాలు అంతగా కురవకపోవడంతో విత్తిన పంటలపై ఆశలు వదులు కుంటున్నారు. మొలకెత్తిన మొక్కలు అక్కడక్కడ ఎండిపోతున్నాయి. వీటిని రక్షించుకునేందుకు రైతులు ఆష్టకష్టాలు పడుతున్నారు. మంజీర పరీవాహక ప్రాంతాల రైతులు సైతం ఆందోళన చెందుతున్నారు. నదిలోని నీటి మడుగులు ఎండిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 25 నుంచి 35 శాతం  వరకు మాత్రమే వరినాట్లు వేసుకున్నట్లు సమాచారం.

వర్షాలు కురిస్తేనే బతుకు
ఆగస్టు నెలలోనైనా వర్షాలు కురిస్తేనే బతకగలుగుతాం. లేకుంటే అప్పుల పాలవుతాం. పత్తిపంటలు వేసి దేవుడి మీద భారం వేశాం. వరి నారు పెంచినా నాట్లు వేసుకునేందుకు ధైర్యం సరిపోతలేదు. ఆగస్టులో సమృద్ధిగా వర్షాలు కురిస్తే బాగుండు.
  శంకర్‌ , రైతు, కిచ్చన్నపల్లి

వరుణుడి కరుణ కోసం...
జూన్, జూలై మాసంలో సరిగ్గా వర్షాలు కురవలేదు. ఈ నెలలోనైనా వానలు పడకుంటా పత్తి పంట మొలకెత్తుడు కష్టమే. అప్పులు చేసి పంటలు పెట్టినం. అధికారులు చెప్పినా చాలా వరకు రైతులు వరుణుడు కరుణించకపోతాడా అని పత్తి పంటలు వేసుకున్నాం. బోర్లు ఉన్న వారే వరి నాట్లు వేసుకుంటున్నారు. వర్షంపై  ఆధారపడి జీవించే మా లాంటి రైతుల పరిస్థితి కష్టంగా ఉంది.
         విఠల్,   రైతు , రాంసానిపల్లి

మరిన్ని వార్తలు