రాష్ర్టంలో నిరంకుశ పాలన

27 Jul, 2016 17:15 IST|Sakshi
రాష్ర్టంలో నిరంకుశ పాలన

  తెలంగాణాను కాదు.. కుటుంబాన్ని బంగారం చేసుకుంటున్నారు
♦  కేసీఆర్‌ మాటలన్నీ అబద్దాలే
♦  రైతుల వెంట కాంగ్రెస్‌ పార్టీ ఉంటుంది
♦  మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌

వికారాబాద్‌ రూరల్‌ : రాష్ర్టంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని రాష్ర్ట మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. బుధవారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లన్నసాగర్‌ అక్రమాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్‌ పార్టీ ధర్నాలు చేస్తే ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు.  కొత్త కొత్త జీఓలను తీసుకువచ్చి అక్రమంగా భూములను రైతుల నుంచి తక్కువ ధరకు లాక్కుంటున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబం పొద్దున లేవగానే అబద్దాలతో స్టార్ట్‌ చేస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ప్రసాద్‌కుమార్‌ అన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని లేనిపోని కల్లబొల్లి మాటలు చెప్పి ఇప్పుడు కుటుంబాన్ని బంగారం చేసుకుంటున్నారన్నారు. రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పి ఇప్పటి వరకు రైతుల రుణమాఫీ చేయలేదన్నారు. రైతుల పక్షాన ఉండి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కేసీఆర్‌ రాష్ర్టంలో చాతకాని పాలన కొనసాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రత్నారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టులో లేనిపోని హామీలు ఇచ్చి ఇప్పుడు గద్దెనెక్కి రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను పట్టించుకోకుండా రాష్ర్టంలో కుటుంబ పాలన కొనసాగిస్తున్నారన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు.  ప్రభుత్వానికి అసలు రైతాంగంపై ఇంతకుండా అవగాహన లేదన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి,  జిల్లా అధికార ప్రతినిధి ఆవుటి రాజశేఖర్‌, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు సుభాన్‌రెడ్డి, కౌన్సిలర్‌ మధు, సర్పంచ్‌ నారాయణరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, వెంటయ్యగౌడ్‌, ఖాలేద్‌, మతీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా