నింగి మెరిసె నేల మురిసె

18 Mar, 2016 08:03 IST|Sakshi
నింగి మెరిసె నేల మురిసె

రెండో రోజూ ఏవియేషన్ షో కిటకిట
చిత్రకారులను స్ఫురింపజేసేలా ఆకాశంలో వి‘చిత్రాలు’... సందర్శకుల మది దోచేలా ప్రదర్శనలు... రూపంలోనూ... సౌకర్యాల్లోనూ ప్రతి విమానం.... దేనికదే ప్రత్యేకం. ఇదీ ‘ఇండియా ఏవియేషన్-2016’ స్పెషల్.

విమానాల విన్యాసాలతో నింగి మెరిసింది. తిలకించిన సందర్శకుల సందడితో నేల మురిసింది. గురువారం ఏవియేషన్ షో ఉత్సాహంగా సాగింది. బేగంపేట విమానాశ్రయ పరిసరాలు బిజినెస్ విజిటర్స్‌తో కిటకిటలాడాయి. రాజహంస అందాల వీక్షణకు జనం ఎండను సైతం లెక్కచేయకుండా బారులు తీరారు. ఎమిరేట్స్ లగ్జరీ లుక్‌ని చూసి ముగ్దులయ్యారు.  - సనత్‌నగర్

విన్యాసాల వీరులు పొగ చిమ్ముతూ విమానం దూసుకెళ్తుంటే.. వినువీధిలో చిత్రాలు ఆవిష్కరిస్తూ వింతలు చేస్తుంటే.. సందర్శకులు రెప్పవాల్చకుండా అంబరాన్ని సంబరంగా చూస్తుంటే.. విన్యాసాల వీరులు వి‘చిత్రాలు’ చేస్తున్నారు. ప్రచండ వేగంతో విమానాలను పల్టీలు కొట్టిస్తున్నారు. తిరిగి యథాస్థితికి చేరుస్తున్నారు. ఏవియేషన్ షోలో మార్క్ జెఫర్స్ బృందం విహంగ విన్యాసాలతో సందర్శకుల మదిదోచుకుంటోంది. ఈ బృంద సారథి జెఫర్స్‌ను ‘సాక్షి’ పలకరించింది. ఆ మాట ముచ్చట మీకోసం.. - సాక్షి, సిటీబ్యూరో

లోహ విహంగాన్ని వినువీధిలో రివ్వుమని ఎగిరిస్తూ.. దాని పొగతో అద్భుత చిత్రాలను ఆవిష్కరించడమే సింక్రనైజ్డ్ స్మోక్ యాక్ట్స్. ఈ విన్యాసాలు చేయడంలో మార్క్ బృందం దిట్ట. ఇండియా ఏవియేషన్-2016లో విన్యాసాలు సృష్టించేందుకు రెండోసారి నగరానికి వచ్చిన ఈ బ్రిటీష్ బృందం.. వీక్షకుల మన్ననలు అందుకుంటోంది.

37 ఏళ్లుగా ఈ విన్యాసాల్లో విహరిస్తున్న మార్క్ వయసు 50కి పైనే. వైమానిక దళంతో ఏ మాత్రం సంబంధం లేని ఈయన విమానాలతో నింగిలో ఆటలాడుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. కేవలం విమానాల మీద ఉన్న ఆసక్తే తనను ఈ రంగంలోకి తీసుకొచ్చిందని చెబుతారు మార్క్. ఈయన ఔత్సాహికులైన మరో నలుగురితో కలిసి ‘గ్లోబల్ స్టార్ ఏరోబాటిక్ టీమ్’ను ఏర్పాటు చేశారు. ఈ బృందం సామూహిక విహంగాల విన్యాసాలతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలు కూడా నిర్వహిస్తుంది.

 యువతలో స్ఫూర్తికి ‘ఎస్‌టీఈఎం’...
‘యువత ‘ఎస్‌టీఈఎం’ వైపు నడిచేలా మా విన్యాసాలతో స్ఫూర్తినిస్తున్నాం. ఎస్‌టీఈఎం అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెకానిక్స్. ఈ నినాదాన్ని మా విన్యాసాలతో యూత్‌లోకి తీసుకెళ్లి వారిని విమానయాన రంగం వైపు అడుగులు వేయించాలన్నదే మా అభిమతం. బ్రిటిష్ ఏరోబాటిక్ అకాడమీకి వేదిక లాంటి కేంబ్రిడ్జి షైర్‌లోని గ్రాన్స్‌డెన్‌లో మా ఏరోబాటిక్ శిక్షణ కేంద్రం ఉంది. దీని ద్వారా ఔత్సాహికులకు శిక్షణ అందిస్తున్నాం. గతేడాది భారత్‌లో 10, ఆస్ట్రేలియా, బహ్రెయిన్‌లో ఆరు ప్రదర్శనలిచ్చాం. ఈ షో ముగిశాక పుణెలో ప్రదర్శనకు వెళ్తామ’ని చెప్పారు మార్క్. 

ఐ లవ్ హైదరాబాద్...
భారత్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ హైదరాబాద్. 2014 ఏవియేషన్ షోకి నా మిత్రుడు టామ్‌తో వచ్చాను. అప్పుడు ఇక్కడి సందర్శకుల నుంచి వచ్చిన స్పందన నేను ఇప్పటికీ మర్చిపోలేను. అదే ప్రోత్సాహం ఈ సారి మరో ఇద్దరు మిత్రులు మైకేల్ పికెన్, కేత్ టేయర్‌లను తీసుకొచ్చేలా చేసింది. గత ఏవియేషన్ షోలో రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లతో ప్రదర్శనలిచ్చాం. ఈసారి నాలుగు క్రాఫ్ట్‌లతో విన్యాసాలు చేస్తున్నాం.
- మార్క్ జెఫర్స్

లైవ్ రికార్డింగ్..
ఈ విన్యాసాల కోసం సొంతంగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఏర్పాటు చేసుకుందీ బృందం. ఈ ఎయిర్ క్రాఫ్ట్‌లో ఒకరు మాత్రమే కూర్చునే వీలుంటుంది. ఇందులో విన్యాసాలకు అవసరమైన ఎక్విప్‌మెంట్ ఉంటుంది. వీరు చేసే విన్యాసాలను రికార్డు చేసేందుకు లైవ్ కెమెరాలు ఉంటాయి.

గల్లంతైన వ్యక్తులను గుర్తించే ‘కాప్టర్’
ప్రమాదకర పరిస్థితుల్లో గల్లంతైన వ్యక్తులను గుర్తించే ఆధునిక పరికరం అటానమస్ కాప్టర్‌ను చెన్నైకి చెందిన ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ విద్యార్థులు రూపొందించారు. ల్యాప్‌టాప్ సహాయంతో గూగుల్ మ్యాప్‌లో పాయింట్లు సెట్ చేస్తే ఈ కాప్టర్ టేకాఫ్ అవుతుంది. అప్పటికే ఈ కాప్టర్‌పై ఏర్పాటు చేసిన కెమెరా లైవ్ వీడియో రికార్డు చేసి ఫొటోలు కూడా తీసేస్తుంది. పెట్రోల్ సహాయంతో నడిచే ఈ విహంగం సుమారు రెండు గంటల పాటు ఐదు కిలోమీటర్ల ఎత్తులో 240 కిలోమీటర్లు వరకు ప్రయాణిస్తుంది. ఫొటోలు తీసి సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తుంది. దీంతో గల్లంతైన వ్యక్తుల సమాచారాన్ని తెలుసుకొని సహాయక చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని అప్రమత్తం చేయొచ్చు. క్లిష్టమైన పరిస్థితుల్లో  అదృశ్యమైన వ్యక్తులను గుర్తించడంలో కీలకపాత్ర పోషిస్తుందని విద్యార్థులు శ్రేయస్ వాసుదేవన్, భరుణ్, అరుణమ్ అంటున్నారు. రెండు నెలలు శ్రమించి ఫైబర్ గ్లాస్, వుడ్ ఉపయోగించి దీనిని తయారు చేశామన్నారు.

విమానాలను లాగేస్తుంది..
బస్‌ను పార్క్ చేసిన చోటు నుంచి మరో చోటుకి మార్చాలంటే పెద్ద కష్టమేమీ కాదు. ఒకవేళ రోడ్డుపై బస్ ఆగిపోతే మరో వాహనంతో లాక్కెళ్లడం సాధారణ విషయమే. అదే విమానాల విషయానికొస్తే.. రన్‌వేపై పార్క్ చేసిన విమానాన్ని మరో చోటుకి మార్చాల్సి వస్తే పెద్ద మొత్తంలో ఇంధనం అవసరం. ఇక విమానం రన్‌వేపై  ఆగిపోతే పరిస్థితేంటి? వీటికి సమాధానమే ఎయిర్‌సైడ్ సిమ్యులేటర్. పెద్ద విమానాలను అలవోకగా ముందుకు లాగడం లేదా వెనకకు తోయడం కోసం దీనిని వినియోగిస్తారు. పైగా విమానాలు వెనకకు ప్రయాణించే అవకాశం లేకపోవడంతో సైడ్ సిమ్యులేటర్ ఆధారంగా వెనకకు నెట్టి అవసరమైన చోట పార్క్ చేస్తారు. 

అనుభూతిని ‘కళ్లకు కడతారు’..
విమానం నడిపే అనుభూతిని పొందాలనుందా? ఫ్లైట్ ఇంజినీర్‌గా మారి ఆ అనుభూతిని సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా? విమానంలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ ఫీలింగ్ కావాలా.?  వీటిలో ఏ అనుభూతిని పొందాలన్న మీరు విమానం ఎక్కాల్సిన అవసరం లేదు. ఏవియేషన్ ఎగ్జిబిషన్‌లో హానివెల్ టెక్నాలజీస్ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శిస్తే చాలు.. ఆ మధురానుభూతులను సొంతం చేసుకోవచ్చు. ప్రత్యేక పరికరాన్ని కళ్లకు కట్టి, హెడ్‌ఫోన్స్‌ను చెవులకు అమరుస్తారు. అంతే మీ తలను అటూ ఇటూ తిప్పుతుంటే విమానంలో పైలట్, ఇంజినీర్, ప్యాసింజర్ స్థానాల్లో కూర్చుంటే ఎలా ఉంటుందో అచ్చం అలాంటి ఫీలింగ్‌ని పొందొచ్చు. 

మీరూ వెళ్లాలంటే...
నేడు బిజినెస్ సందర్శకులకు మాత్రమే ప్రవేశం. టికెట్ ధర: రూ.700
19, 20 తేదీల్లో సామాన్య సందర్శకులకు ప్రవేశం. టికెట్ ధర: రూ.300
వేళలు: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు..
www.bookmyshow.comవెబ్‌సైట్‌లో టికెట్లు లభిస్తాయి.
ఎయిర్ షో వేళలు: ఉదయం 11 నుంచి 11.15, మధ్యాహ్నం 3 నుంచి 3.15
పార్కింగ్ బేగంపేట విమానాశ్రయం కార్గో ఏరియాలో వాహనాలు పార్క్ చేయాలి.
ఫుడ్ బయట నుంచి ఆహారం, మంచినీరు అనుమతించరు. ఎగ్జిబిషన్  ప్రాంగణంలోనే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి.

మరిన్ని వార్తలు