వ్యాధులపై అప్రమత్తం

27 Jun, 2016 10:53 IST|Sakshi

- గ్రామాల వైద్య శిబిరాల ఏర్పాటు
-  వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన
-  డీఎంహెచ్‌ఓ సాంబశివరావు

 
 డెంగీపై ప్రత్యేక దృష్టి
 గత సంవత్సరం జిల్లాలో 244 డెంగీ కేసులు నమోదయ్యాయి. సమస్యాత్మకంగా గుర్తించిన హసన్‌పర్తి, గూడూరు, ఆజంనగర్, ములుగు, కంబాలపల్లి, వరంగల్ అర్బన్ పీహెచ్‌సీల పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టాం. వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బంది ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాం.
 
 ఎంజీఎం : వర్షకాలం ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా గిరిజన, ఆదివాసీలు నివసించే తండాల్లో వ్యాధులు ప్రబలుతుంటాయి. అయితే గత సంవత్సరం ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధుల నివారణకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సాంబశివరావు చెపుతున్నారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, క్షేత్రస్థాయిలో సేవలందించేలా సిబ్బందిని అప్రమత్తం చేశామని అంటున్నారు. వ్యాధుల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలను ఆదివారం డీఎం హెచ్‌ఓ ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
 
 వర్షాకాలంలో సీజనల్ వ్యాదులు ప్రబలే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం. ప్రతీ సంవత్సరం గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులు విస్తారంగా విజృంభించి ప్రజలు మంచం పట్టే పరిస్థితులు నెలకొంటున్నారుు. ఈ ఏడాది అలా జరుగకుండా  వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. మలేరియా నివారణ మాసోత్సవంలో భాగంగా జూన్‌లో కీటక జనిత వ్యాధుల పట్ల అవగాహన ర్యాలీలు, నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మలేరియా వ్యాధి- తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ గ్రామాల్లో 1.50 లక్షల కరపత్రాలు పంపిణీ చేశాం.
 
 ఏజెన్సీ ప్రాంతాల్లో ముందస్తు వైద్య శిబిరాలు...
 జిల్లాలో గతంలో వ్యాధులు విజృంభించిన ప్రదేశాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందించేవాళ్లం. అయితే కలెక్టర్ వాకాటి కరుణ అదేశాలతో ప్రతి గురువారం ఆయా క్లస్టర్ పరిధిలో ఎంపిక చేసిన  గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి, సలహాలు, సూచనలతో పాటు అవసరమైన చికిత్స అందించేలా ప్రణాళిక రూపొందించాం. జిల్లాలో గత ఏడాది 336 మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 241 కేసులు ఏజెన్సీ ప్రాంతాల్లోనే.
 
 ఈ సంవత్సరం ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాం. 165 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ముందస్తుగా స్ప్రే చేశాం. గ్రామ పంచాయతీ, పారిశుధ్య నిధులతోయాంటీ లార్వాల్ చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో ఉన్న 590 మంది సూపర్‌వైజర్లు, 1100 మంది ఏఎన్‌ఎంలు, 3174 మంది ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యాధి నివారణ చికిత్సకు అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాం.
 
 ప్రతి శుక్రవారం డ్రై డే..
 జిల్లాలో ప్రతి శుక్రవారం డ్రై డే పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. పట్టణాలు, గ్రామాల్లో నీరు నిల్వ లేకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి వివరిస్తున్నాం. డ్రమ్ములు, నిరుపయోగంగా ఉన్న కూలర్లు,  తాగిపడేసిన కొబ్బరి బొండాలు, పాతటైర్లలో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.
 
 కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల నియూమకం..
 ఈ సంవత్సరం ఏజెన్సీ ప్రాంతంలో 26 మంది పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులు విధులు నిర్వర్తిస్తారు. కలెక్టర్ అదేశాలతో ఏజెన్సీలో కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల నియూమకానికి ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రీయ బాల స్వస్తా కార్యక్రమంలో చేపట్టిన సిబ్బందితో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు వైద్యచికిత్సలు అందిస్తున్నాం.
 
 వివిధ శాఖల సహకారంతో...
 సమస్యాత్మక గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహణకు పీహెచ్‌సీ, పారామెడికల్ సిబ్బందితో పాటు శిశు సంక్షేమ, గ్రామీణ నీటి పారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సహకారం తీసుకుంటున్నాం. ఈ శిబిరాల ద్వారా గర్భిణులు, బాలలకు పౌష్టికాహారం, శుద్ధి చేసిన తాగునీటి సరఫరా, గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, క్లోరినేషన్,  దోమల నివారణ వంటి అంశాలపై వివరిస్తాం.

మరిన్ని వార్తలు