తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన

4 Aug, 2016 18:03 IST|Sakshi
తల్లిపాలపై వివరిస్తున్న డాక్టర్‌ సూర్యకాంత్‌
ఆదిలాబాద్‌ రిమ్స్‌ : తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆడిటోరియంలో తల్లిపాల ప్రాముఖ్యతపై ఆస్పత్రిలోని బాలింతలు, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. డబ్బా పాలు వద్దు.. తల్లిపాలే ముద్దు.. అనే అంశంపై రిమ్స్‌లో మూడో సంవత్సరం వైద్య విద్యార్థుల నాటక ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది.
 
వైద్య విద్యార్థులు విక్రాంత్, ప్రణయ్, హరిత, మాధురి, మానస, రమ్య, నిహారిక, స్నేహ, లేఖ, లలిత, రోహిత్, గీతలు నాటికలోని తల్లిదండ్రులు, ఆశవర్కర్, వైద్యులు, సర్పంచ్‌ పాత్రాల్లో నటించారు. గర్భందాల్చిన నాటి నుంచి ప్రసూతి అయ్యే వరకు, తర్వాత పుట్టిన పిల్లలకు తల్లిపాలు తాగించడం వరకు ప్రస్తుత సమాజంలో ఎలా జరుగుతుందనే విధానంపై వివరించారు. పిల్లల వైద్య నిపుణుడు సూర్యకాంత్‌ తల్లిపాల ప్రాముఖ్యతపై మాట్లాడారు.
 
పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు తాగించాలని, వీటినే ముర్రపాలు అంటారని, ఇవి తాగిన పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ఈ పాలు కామెర్లు, విరేచనాల నుంచి బిడ్డను కాపాడుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్‌ ఇన్‌చార్జి డైరెక్టర్‌ అశోక్, ఆర్‌ఎంఓ డాక్టర్‌ వినయ్‌కుమార్, మెడికల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు