విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

1 Aug, 2016 00:43 IST|Sakshi
మిర్యాలగూడ : కృష్ణా పుష్కరాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ కిషన్‌రావు సూచించారు. ఆదివారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన తహసీల్దార్ల సమావేశంలో ఆయన పలు సూచనలు, సలహాలు చేశారు.  పుష్కర ఘాట్ల వద్ద కంట్రోల్‌ రూంలతో పాటువాడపల్లి, మట్టపల్లి, నాగార్జునసాగర్‌లో సెంట్రల్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  ఘాట్ల వద్ద మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధుల్లో ఉండాలని, కంట్రోల్‌ రూంలోనూ 11 మంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఘాట్ల వద్ద ప్రతి రెండు గంటలకు ఒక సారి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరారు. డ్రోన్, సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని తెలిపారు. ఘాట్ల నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయన్నారు. అన్నదానం చేయాలనుకున్న వారు కేవలం పులిహోర ప్యాకెట్లు మాత్రమే పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఘాట్ల వద్ద విద్యుత్‌ సరఫరాలో అంతరాయం జరగకుండా చూడాలని, కరెంట్‌ పోతే వెంటనే జనరేటర్లు వేయాలని సూచించారు.  ప్రమాదాలకు తావు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. వీఐపీల కోసం వాడపల్లిలోని శివాలయం, నాగార్జునసాగర్‌లోని శివాలయం, మట్టపల్లిలోని ప్రహ్లాదఘాట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మిర్యాలగూడలో సోమవారం నుంచి కంట్రోల్‌ రూమ్‌ (ఫోన్‌ నెం. 08689–242890) పని చేస్తుందని చెప్పారు.  సమావేశంలో తహసీల్దార్లు సత్యనారాయణ, గణేష్, పాండు, యదగిరి తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు