జీవశ్చవంలా..!

10 Jun, 2016 03:55 IST|Sakshi
జీవశ్చవంలా..!

బీటెక్ విద్యార్థి ఆశలపై నీళ్లు
►కుటుంబాన్ని వెక్కిరించిన ప్రమాదం
దాతలు స్పందించాలనివేడుకోలు
 

 
 ఒక్కగానొక్క కుమారుడిని బాగా చదివిస్తే ప్రయోజకుడై కుటుంబానికి ఆసరాగా ఉంటారని తల్లిదండ్రులు కలగన్నారు. వారొకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది. మరో ఏడాది ఉంటే చదువు పూర్తయి ఉద్యోగం వస్తుందని అందరూ అనుకుంటున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో ఆ కుటుంబం ఆశలపై నీళ్లు చల్లింది. ఉద్యోగం ద్వారా ఇంట్లో అందరికీ చేదోడు, వాదోడుగా నిలవాల్సిన కుమారుడికి తల్లిదండ్రులు, చెల్లెళ్లు సేవలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 

 
దేవనకొండ మండలం కరివేముల గ్రామానికి చెందిన బి. వెంకటేశ్వర్లు వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ఒక్కగానొక్క కుమారుడు బి. వన్నూరప్ప చాలా తెలివైన కుర్రాడు. ఎంసెట్‌లో 6,023 ర్యాంకు రావడంతో అతనికి హైదరాబాద్‌లోని టి.రామిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో ఈసీఈ బ్రాంచ్‌లో ఉచితంగా సీటు వచ్చింది. మరో ఏడాది ఉండగా చదువు పూర్తయి ఆ కుటుంబానికి ఆసరగా నిలుస్తాడని కుటుంబీకులు ఆశిస్తున్న తరుణంలో విధి వారిని వెక్కిరించింది. గత సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చిన వన్నూరప్ప ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించగా వైద్యులు పిడుగులాంటి చేదునిజాన్ని చెప్పారు. ప్రమాదంలో అతని స్పైనల్‌కార్ట్ దెబ్బతినిందని, దీంతో కాళ్లు, చేతులు స్పర్శకోల్పోయాయని వివరించారు.

అంతే ఆ వార్త విన్న కుటుంబం సైతం కుప్పకూలిపోయింది. కుటుంబంలో పెద్దవాడైన ఆ విద్యార్థి జీవితం అర్ధంతరంగా మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. మంచాన పడి ఉన్న అతనికి తల్లిదండ్రులు, చెల్లెళ్లు ఆసరాగా నిలుస్తున్నారు. ఐదు నెలల పాటు మంచంలోనే ఉండటంతో వీపుపై బొబ్బలు ఏర్పడ్డాయి. అతను మారుమూల గ్రామంలో ఉండటంతో ప్రతిరోజూ ఫిజియోథెరపి, పారామెడికల్ కేర్ చేయడానికి కుదరడం లేదు. ఫిజియోథెరపి వల్ల కనీసం చేతులైనా వస్తాయని చెప్పడంతో ఆ దిశగా కుటుంబసభ్యులు కష్టపడుతున్నారు. మంచానికే పరిమితమైన కుమారునికి అవసరమైన చికిత్సకు ఇప్పటికే రూ.3లక్షలకు పైగా ఖర్చు చేశారు. దాతలు స్పందించి తనకు అవసరమైన చికిత్స చేయిస్తే కాస్తయినా కోలుకుని కుటుంబానికి ఆసరాగా నిలుస్తానని వన్నూరప్ప కోరుతున్నారు. దాతలు చేయాల్సిన ఫోన్ నెంబర్ 96038 64433.
 
 
 బ్యాంకు అకౌంట్ వివరాలు
 
 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  
 అకౌంట్ నెంబర్: 32684410386
 ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : ఆఐూ0011992
 బ్రాంచ్ కోడ్ ఃn 992  

 

మరిన్ని వార్తలు