హోదాను తాకట్టు పెట్టిన బాబు

21 Oct, 2016 23:54 IST|Sakshi
హోదాను తాకట్టు పెట్టిన బాబు
- ప్యాకేజి పేరిట మోసం
- ప్రత్యేక హోదాతోనే భవిష్యత్‌ 
- 25 కర్నూలులో యువభేరి 
- వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
 
కర్నూలు(ఓల్డ్‌సిటీ): స్వప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి తాకట్టు పెట్టారని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక కృష్ణకాంత్‌ ప్లాజాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజి పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు. హోదా వస్తే పరిశ్రమలు ఏర్పాటై ఉపాధి అవకాశాలకు మార్గం ఏర్పడుతుందన్నారు. తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. హోదా ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై యువకులు, విద్యార్థులు.. ప్రజలను చైతన్య వంతం చేయాలని సూచించారు. ఇందులో భాగంగానే కర్నూలులో ఈనెల 25న గుత్తి జాతీయ రహదారిలో వీజేఆర్‌ కన్వెషన్‌ సెంటర్‌లో యువభేరి కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. విద్యార్థులు, యువకులతో ముఖాముఖి నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, పార్టీలకు అతీతంగా పాల్గొని యువభేరిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువభేరి ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా పరిశీలకుడు అనంతవెంకట్రామిరెడ్డి, అదనపు పరిశీలకుడు రవీంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, ఎమ్మెల్యేలు ఐజయ్య, సాయిప్రసాద్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, నియోజకవర్గ ఇన్‌చార్జీలు హఫీజ్‌ ఖాన్, చెరుకులపాడు నారాయణరెడ్డి, కాటసాని రామిరెడ్డి, బుడ్డా శేషారెడ్డి, నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్, మైనారిటీసెల్‌ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్, నగర అధ్యక్షుడు గోపినాథ్‌ యాదవ్, దొడ్డిపాడు మాబ్బాష తదితరులు పాల్గొన్నారు.
 
అదేం కోరిక
నెల్లూరు జిల్లాలో పుట్టిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, చిత్తూరు జిల్లాలో పుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..అమెరికాలో పుట్టింటే బాగుండునని కోరుకుంటూ ఇటీవల చేసిన ప్రకటన విడ్డూరంగా ఉందని పీఏసీ ఛైర్మన్, డోన్‌ శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. దీన్నిబట్టి వారికి ఇక్కడి అభివృద్ధి గురించి చిత్తశుద్ధి లేదని తెలుస్తోందన్నారు. హోదాను విస్మరించి.. ప్యాకేజీతో పార్టీని పటిష్టం చేసుకునే దుర్మార్గపు ఆలోచన చంద్రబాబుకు ఉందేమోనని సందేహం వ్యక్తం చేశారు. హోదా అంశాన్ని రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పెట్టాల్సిన అవసరమేలేదని తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని, ప్రత్యేక హోదా ప్రాధాన్యతను గ్రామగ్రామాన చాటాల్సిన అవసరం ఉందని తెలిపారు.
 
వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
ప్రత్యేక హోదా నినాదంతో మొదట్నుంచీ వైఎస్‌ఆర్‌సీపీ పోరాడుతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని నందికొట్కూరు శాసన సభ్యుడు ఐజయ్య పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఉద్యమిస్తే జైలుకు పంపిస్తానని, పీడీయాక్టు పెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించడం అప్రజాస్వామికమన్నారు.  కర్నూలులో 25న జరిగే యువభేరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
 
హోదా వస్తేనే విద్యార్థుల భవిష్యత్తు: సలాంబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్రానికి హోదా వస్తేనే విద్యార్థులు, యువకుల భవిష్యత్తు బాగు పడుతుందనే ఉద్దేశంతోనే ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారని విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా హోదా తేలేకపోగా, ప్యాకేజీకి సీఎం చంద్రబాబు వెంపర్లాడుతుండటం మోసపూరితమన్నారు. హోదా సాధనలో విద్యార్థులదే కీలకపాత్ర అన్నారు. కర్నూలులో యువభేరిని విద్యార్థులు విజయవంతం చేయాలన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా యువభేరి పోస్టర్‌ విడుదల చేశారు.
 
మరిన్ని వార్తలు