ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు

19 Oct, 2016 22:54 IST|Sakshi
– కాలుష్య కారక కర్మాగారాన్ని అడ్డుకుంటే జైల్లో పెడతారా
– హత్యాయత్నం కేసులు నమోదు చేస్తారా
– తుందుర్రు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్‌ దారుణం
– ప్రజాఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు కుట్ర
– తణుకు సబ్‌జైలులో ఆరేటి సత్యవతిని పరామర్శించిన వైఎస్‌ జగన్‌
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు :
భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని అడ్డుకున్న వారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఆక్వా పార్క్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతూ అరెసై ్ట 38 రోజులుగా రిమాండ్‌లో ఉన్న తుందుర్రు గ్రామానికి చెందిన ఆరేటి సత్యవతిని తణుకు సబ్‌జైల్‌లో కలుసుకుని పరామర్శించారు. పోలీసుల వైఖరిని, అక్కడ ఫ్యాక్టరీ వద్దంటూ జరుగుతున్న పోరాట వైనాన్ని అడిగి తెలుసుకున్నారు. సత్యవతి చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపిన జగన్‌మోహనరెడ్డి ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత సత్యవతి కూతురు కల్యాణితో కలిసి మీడియాతో మాట్లాడారు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణం వల్ల గ్రామాలు కలుషితమవుతాయని, పంటలు నాశనమవుతాయని ఆందోళన చేస్తుంటే వారిపై హత్యాయత్నం చేసులు నమోదు చేస్తారా అని జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. కేవలం ప్రశ్నించినందుకే హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆరేటి సత్యవతిని తణుకు  çసబ్‌జైలులో, ఆమె కుమారుణ్ణి నరసాపురం సబ్‌జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని వ్యతిరేకించినందుకు మొత్తం ఏడుగురిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఇతరులు అని రాసి.. ఆ ఇతరులుగా మిమ్మల్నీ అరెస్ట్‌ చేస్తామంటూ గ్రామస్తులను పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఆ ఇతరుల్లోనే సత్యవతిని చూపించి అరెస్ట్‌ చేశారని ఆయన విమర్శించారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టకు పోయి ఆక్వా పార్క్‌ నిర్మాణానికి ఆమోద ముద్ర వేయడం దారుణమన్నారు. దానికి వ్యతిరేకంగా నిలబడిన వారిపై ఇలా కేసులు నమోదు చేస్తూ గ్రామాల్లో 144 సెక్షన్‌ అమలు చేయడం దుర్మార్గమన్నారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన డెల్టా పేపర్‌ మిల్లు వల్ల ఇప్పటికే యనమదుర్రు డ్రెయిన్‌ కాలుష్య కాసారంగా మారిందని గుర్తు చేశారు. దాని కారణంగా భీమవరం పరిసర ప్రాంతాలు ప్రాంతాలు కలుషితమై దుర్వాసన వెదజల్లుతున్నాయని, పంటలు సైతం పండని పరిస్థితి నెలకొందన్నారు. గోదావరి ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణం చేపడితే గొంతేరు డ్రెయిన్‌ కూడా ఇలాగే కలుషితం అవుతుందని స్థానికులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. సముద్ర తీరాన్ని ఆనుకుని ఆక్వా పార్క్‌ ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఎన్నో గ్రామాలకు చెందిన ప్రజలు వ్యతిరేకిస్తుంటే చంద్రబాబు సర్కారు ఉసురు పోసుకుంటోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కాలుష్యం ఉండదని చెబుతూనే మరోవైపు ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలను పైపులైన్‌ ద్వారా సముద్రంలోకి మళ్లిస్తామని చెబుతూ.. కాలుష్యం ఉంటుందనే వాస్తవాన్ని చంద్రబాబు ఒప్పుకుంటున్నారన్నారు. రోజుకు 3 వేల టన్నుల రొయ్యలను రసాయనాలతో కడిగి కోల్ట్‌స్టోరేజీలో ఉంచుతారని, దీనివల్ల కాలుష్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్రైవేటు సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం పైపులైన్‌ ఏర్పాటు చేయడం ఏమిటని నిలదీశారు. పైపులైన్‌ నిర్మిస్తే స్థల సేకరణకు, దాని నిర్మాణానికి రూ.25 కోట్లు అవుతుందన్నారు. ప్రై వేటు సంస్థకు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారని ప్రశ్నించారు. ఒకవేళ పైపులైన్లు ఏర్పాటు చేస్తే అవి ఎక్కడైనా లీకేజీలు ఉంటే ఆ ప్రాంతంలోని పొలాలు సర్వనాశనం అవుతాయన్నారు. దీనిద్వారా మత్స్యకారులు, రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఆక్వా పార్క్‌ను తక్షణమే సముద్ర తీరప్రాంతానికి తరలించాలని కోరారు. గత రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా ముందుకెళుతుండటం సమంజసం కాదన్నారు. సముద్ర తీరంలో ఆక్వా పార్క్‌ యాజమాన్యానికి 350 ఎకరాల సొంత భూములు ఉన్నాయని, ప్రాజెక్ట్‌ను అక్కడికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అందరి సహకారం ఉంటుందని చెప్పారు. వైఎస్‌ జగన్‌ వెంట వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, ముఖ్య నాయకులు వంకా రవీంద్రనాథ్, కారుమూరి నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, కవురు శ్రీనివాస్, రాష్ట్ర ప్రోగామింగ్‌ కమిటీ కన్వినర్‌ తలశిల రఘురామ్‌ తదితరులు ఉన్నారు.
 
మరిన్ని వార్తలు