బాబు హామీలన్నీ బూటకాలే

24 Jul, 2017 00:05 IST|Sakshi
బాబు హామీలన్నీ బూటకాలే
- ఉపఎన్నిక కోసమే వాగ్దానాలు 
- సీఎం గిమ్మిక్కులను నమ్మొద్దు
- ఎన్నికలు పూర్తయిన తరువాత
  జీవోలన్నీ చిత్తుకాగితాలే
- కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి
 
నంద్యాలఅర్బన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నంద్యాల పర్యటనలో ఇచ్చిన హామీలన్నీ బూటకాలేనని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు.  ఆదివారం సాయంత్రం నంద్యాల పట్టణంలోని 1వ వార్డు అరుంధతీనగర్‌లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నూతన వధూవరులు సోని, షేక్‌మాబాషాలను దీవించారు. ఎల్‌ఐసీ ఉద్యోగి రమేష్‌ కుటుంబంతో మాట్లాడి వైఎస్సార్‌సీపీ మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కడప ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్లను మభ్యపెట్టడానికి సీఎం చంద్రబాబు.. రూ.300కోట్లకు జీవోలను విడుదల చేశారని గుర్తు చేశారు. నాలుగు నెలలు గడిచినా టెండర్లు జరగలేదని, బాబు వేసిన శిలాఫలకాలు దిష్టిబొమ్మల్లా ఉన్నాయన్నారు. జీవోలు చిత్తు కాగితాలుగా మారాయని, మళ్లీ ఆయన ఇదే గిమ్మిక్కును నంద్యాలలో ప్రయోగిస్తున్నారన్నారు. ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. 
 
నవ రత్నాలతో రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు...
తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల పథకాలతో రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ఎంపీ అవినాష్‌ రెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి పాలనకు గుణపాఠం నేర్పడానికి నంద్యాల ఉపఎన్నికనే సరైన వేదిక అన్నారు. ఓటర్లు ఆలోచించి బాబుకు బుద్ధి చెప్పాలన్నారు. 2019 ఎన్నికలకు నాందిగా భావిస్తున్న నంద్యాల ఉపఎన్నికలో వైస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైతే  దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. టీడీపీ.. ధన బలంతో నంద్యాల ఉపఎన్నికల్లో గెలవాలని చూస్తోందని..ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. 
 
వైఎస్సార్‌సీలోకి మాజీ కౌన్సిలర్‌ మునెయ్య...
వైఎస్సార్‌ అభిమాని, మాజీ కౌన్సిలర్‌ మునెయ్య, ఆయన అనుచరులు ఆదివారం వార్డు పర్యటనకు వచ్చిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కల్లూరి రామలింగారెడ్డిల సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా కల్లూరి రామలింగారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభిమానులు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. శిల్పామోహన్‌రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించి టీడీపీకి బుద్ధి చెప్పాలన్నారు. వీరి వెంట స్థానిక కౌన్సిలర్‌ కన్నమ్మ, నాయకులు ఎల్లయ్య, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు