తెగిపడ్డ..నింగి చుక్క!

12 Jul, 2016 04:39 IST|Sakshi
తెగిపడ్డ..నింగి చుక్క!

కాకులు బొడ్డు పొడుస్తున్నాయి..
పసిగుడ్డు గుక్కపెట్టింది..
స్పందించిన హృదయాలు
హుటాహుటిన రిమ్స్‌కు తరలింపు

తెగిపడ్డా నింగి చుక్కనా.. చెత్త కుండి కాడ కుక్కనా.. ఏ తల్లి కన్నా బిడ్డనో.. నేను ఏ అయ్యా కన్నా కొడుకునో.. కాలు జారిన తల్లి ఎవరో.. కండ కావరమెక్కిన తండ్రి ఎవరో కరుణ లేని ఓ తల్లిదండ్రులారా.. నమ్మించి నన్నేలా గొంతెట్ల కోశారు.. తెగిపడ్డా నింగి చుక్కనా.. చెత్తకుండి కాడా కుక్కనా?

ఒంగోలు టౌన్ : ఆ శిశువు భూమిపై పడి గంటలు కూడా కాలేదు. శరీరంపై రక్తపు మరకలు కూడా పోలేదు. తల్లి ఒడిలో వెచ్చగా ఉండాల్సిన శిశువు ఒంటరిగా నేలపై పడి ఉంది. కన్నతల్లి మాతృత్వ బంధాన్ని తెంచుకొని వదిలేసి వెళ్లింది. కళ్లు కూడా సరిగా తెరవని ఆ శిశువుపై కాకులు వాలాయి. వాటి ముక్కుతో శిశువు బొడ్డు పొడుస్తున్నాయి. కళ్లు కూడా తెరవలేని స్థితిలో ఉన్న ఆ శిశువు గుక్కపెట్టి ఏడ్చింది. అదే సమయంలో సమీపంలోని వ్యక్తి ఇంటి నుంచి ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్తుండగా పసికందు ఏడుపు వినిపించింది. హుటాహుటిన తన భార్య, చుట్టుపక్క వాళ్లను పిలిచి ఆ శిశువును రిమ్స్‌కు తరలించారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఒంగోలులోని భాగ్యనగర్ రెండో వీధిలోని చిన్న గొందిలో జరిగింది.

ఏం జరిగిందంటే..?
అప్పుడే ప్రసవించిన ఒక మహిళ తన పేగు తెంచుకొని పుట్టిన మగ బిడ్డకు రక్తపు మరకలు కూడా తుడవకముందే అలాగే వదిలేసి వెళ్లింది. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో మధ్యాహ్నం సమయంలో ఆమెను ఎవరూ గమనించలేదు. ఆ శిశువు కళ్లు కూడా తెరిచే స్థితిలో లేడు. తల్లి ఒడిలో ఉన్నట్లుగానే భావించి అలాగే ఉన్నాడు. అయితే శిశువు శరీరంపై రక్తపు మరకలు ఉండటాన్ని కాకులు గమనించాయి. క్షణాల్లో అక్కడకు చేరుకొని ఆ శిశువు బొడ్డును పొడవడం మొదలుపెట్టాయి. భీత్తిల్లిన ఆ శిశువు పెద్దగా ఏడవడంతో అదే సమయంలో సమీపంలో నివసిస్తున్న పసుమర్తి రంజిత్‌కుమార్ అనే వ్యక్తి మధ్యాహ్న భోజనం ముగించుకొని తన కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌కు బయల్దేరేందుకు బయటకు వచ్చాడు.

శిశువు ఏడుపు వినిపించడంతో వెంటనే తన భార్య కానుకను కేకలు వేసి పిలిచాడు. భార్యాభర్తలిరువురూ హుటాహుటిన శిశువు ఏడుపు వినిపిస్తున్న ప్రాంతానికి చేరుకున్నారు. వెంటనే రిమ్స్‌కు తరలించారు. విషయాన్ని ఐసీపీఎస్ డీసీపీఓ జ్యోతిసుప్రియకు చెప్పడంతో ఆమె ఆ వెంటనే రిమ్స్‌కు చేరుకున్నారు. శిశువు ఆరోగ్య పరిస్థితిని వైద్యులనడిగి తెలుసుకున్నారు. బిడ్డ ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శిశువు విషయాన్ని సీడబ్ల్యూసీ చైర్మన్, జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ పీడీ దృష్టికి తీసుకెళ్లారు. 

మరిన్ని వార్తలు