బడి.. రెడీ

11 Jun, 2017 00:46 IST|Sakshi
బడి.. రెడీ
భీమడోలు/నిడమర్రు : బడి గంటలు మోగే సమయం ఆసన్నమైంది. 49 రోజుల వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు పునఃప్రారంభం కాబోతున్నాయి. నెల రోజులపాటు వృత్త్యం తర శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బోధనా పద్ధతులకు మెరుగులు దిద్దుకున్నారు. కొత్త ఉత్సాహంతో తరగతి గదుల్లోకి అడుగు పెట్టబోతున్నారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికే విద్యార్థుల నమోదు, పాఠశాలల పరిశుభ్రత, సంసిద్ధత కార్యక్రమాలు చేపట్టాలని సర్వశిక్షాభియాన్‌ అధికారులు ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేశారు. దీంతో వారంతా శనివారం నుంచే బడిబాట పట్టారు. కొత్త తర గతుల్లో చేరేందుకు సోమవారం నుంచి విద్యార్థులు రానుండటంతో గదులు, బెంచీలను శుభ్రం చేయించే పనిలో ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు.
 
వృత్తి నైపుణ్యం పెంచుకుని..
జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు శుక్రవారం వరకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ పొందారు. జిల్లాలో ప్రభుత్వ అన్ని యాజమాన్యాల పరిధిలో 3,300 పాఠశాలలు ఉండగా.. ఉపాధ్యాయులందరికీ వృత్త్యంతర శిక్షణ పూర్తయ్యింది. విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈనెల 10నుంచి 16వ తేదీ వరకు నిర్వహించాలి్సన కార్యక్రమాలకు సంబంధించి మార్గదర్శకాలు వెలువడ్డాయి. గత ఏడాది నిర్వహించిన తరగతి సంసిద్ధత, సంకల్పం, మన బడి–మన బాధ్యత, బోధనా పరికరాల మేళాలు, పాఠశాలల వార్షికో త్సవాలు, వేసవి బడులు వంటి కార్యక్రమాల ఫలితాలను ఒడిసిపట్టి పాఠశాలల పటిష్టతకు నడుం బిగించాలని అధికారులు నిర్దేశం చేశారు. ప్రతి పాఠశాలలో గత ఏడాది కన్నా 5నుంచి 10 మంది విద్యార్థులను నూతనంగా చేర్పించేందుకు ఉపాధ్యాయులు నడుం కట్టారు. 
 
చేపట్టాలి్సన కార్యక్రమాలివీ 
l ఐదేళ్ల వయసు నిండిన చిన్నారులను జూన్‌ 10నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
l పాఠశాలల పరిశుభ్రత, సంసిద్ధత కార్యక్రమాలు చేపట్టాలి. పాఠశాల పరిసరాల్లో పిచ్చిమొక్కలు, చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. 
l ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రాథమిక పాఠశాలలు రూ.వెయ్యి, యూపీ, హైస్కూళ్లు రూ.1500 చొప్పున పాఠశాల నిర్వహణ గ్రాంట్‌ నుంచి వినియోగించుకోవచ్చు. బ్యానర్లు, ఆడ్మిషన్‌ ఫారాలు సిద్ధం చేసుకుని ఈనెల 16వ తేదీ వరకు విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
l పాఠశాలకు నిర్ణయింపబడిన రంగులు వేయించాలి. ఇందుకు గ్రాంట్లను వినియోగించుకోవాలి.
l పాత పుస్తకాలు, విరిగిన కుర్చీలు, బల్లలు లేకుండా చూసుకోవాలి. వీలైతే వాటిని బాగు చేయించడం లేదా స్టాక్‌ రిజిస్టర్‌లో నమోదు చేసి విక్రయించాలి.
l పాఠశాలల్లో విద్యుత్‌ సౌకర్యం సరిగా ఉండేలా చూసుకోవాలి. ఫ్యాన్లు, లైట్లు, మోటార్‌ కండిషన్‌లో ఉండేలా చూసుకోవాలి.
l టాయిలెట్లు, మంచినీటి ట్యాంకులు బాగుం డాలి. వాటిలో నీటి ప్రవాహం ఉండేలా ఏర్పాట్లు చేయించాలి. టాయిలెట్ల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 1800–425–6358 అందరికీ కనిపించేలా పెయింట్‌తో రాయించాలి.
l కిచెన్‌ షెడ్‌ను మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో శుభ్రం చేయించి జూన్‌ 12 నాటికి వంటకు సిద్ధం చేసుకోవాలి. పాఠశాల ఆవరణలో అంగన్‌వాడీ కేంద్రం ఉంటే.. ఆ సిబ్బందిని కలుపుకుని వెళ్లాలి.
l ప్రతి శుక్రవారం సాయంత్రం 4నుంచి 6 గంటల వరకు అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్ల లందరికీ ఏఎన్‌ఎంలు, ఉపాధ్యాయులు  చదువు, ఆటపాటలు ఉండేలా సమీక్షించి చిన్నారుల ప్రగతిని పరిశీలించాలి.
l సృజన పుస్తకాల ఆధారంగా బోధనా పరికరాల (టీఎల్‌ఎం)ను ఉపాధ్యాయులు విధిగా తయారు చేయాలి. లేదంటే ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటారు.
l పాఠశాల తరగతి సంసిద్ధత కార్యక్రమాలకు ఉపాధ్యాయులంతా ఉమ్మడి నిర్ణయం తీసుకుని తదనుగుణంగా చర్యలు చేపట్టాలి. విద్యా సంవత్సరంలో రోజువారీ కార్యక్రమాలను రికార్డు చేయాలి. 
l ఐదేళ్లు నిండిన చిన్నారులందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు వారి తల్లిదండ్రులతో సమావేశం కావాలి. 
l చిన్నారుల హాజరు పుస్తకాలు, ప్రమోషన్‌ జాబితాలను సిద్ధం చేసుకోవాలి. 
l నూతనంగా చేరే విద్యార్థుల ఆధార్‌ నంబర్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. 
l తరగతుల వారీగా పిల్లలందరికీ పాఠ్య పుస్తకాలు, రెండు జతల చొప్పున ఏకరూప దుస్తులు అందించాలి.
l పాఠశాలల్లో పిల్లల సాయంతో కిచెన్‌ గార్డెన్లు నిర్వహించాలి. పిల్లలకు ఉపాధ్యాయులు మార్గదర్శకులుగా ఉంటూ వారిని ప్రోత్సహించాలి.
 
మరిన్ని వార్తలు