ప్రేక్షకులే ‘బలి’

28 Apr, 2017 10:27 IST|Sakshi
ప్రేక్షకులే ‘బలి’
  • డిస్ట్రిబ్యూటరే బ్లాక్‌ టిక్కెట్ల విక్రేత
  • అధికారికంగా ప్రభుత్వం పెంచింది రూ.200
  • గంపగుత్తగా రూ. 200 టిక్కెట్‌ రూ.400కు అమ్మేసిన డిస్ట్రిబ్యూటర్లు 
  • వారి నుంచి కొన్నవారు అమ్మేధర రూ. 650 నుంచి 800
  • రూ.30 నేల టిక్కెట్‌ ధర రూ. 200 నుంచి 300
  • పేక్షకుల ఆసక్తిని సొమ్ము చేసుకుంటున్న వైనం 
  • పట్టించుకుకోని క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు
  • కొత్త కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా వైపు ప్రేక్షకుల చూపు
  •  
    సాక్షి, రాజమహేంద్రవరం :
    బాహుబలి సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని తమకు అనుకూలంగా మలుచుకున్న సినిమా డిస్ట్రిబ్యూటర్లు గతంలో ఎన్నడూ లేని విధంగా వారే బ్లాక్‌లో టిక్కెట్లు గంపగుత్తగా విక్రయించేస్తున్నారు. వారి వద్ద  టిక్కెట్లు కొన్న వారు ప్రేక్షకులకు మరింత ధర పెంచి అమ్మేస్తున్నారు. జిల్లాలో ఉన్న దాదాపు 190 థియేటర్లలో బాహుబలి సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమా టిక్కెట్‌ ధరలను అధికారికంగా ఎక్కువ ధరకు పెంచి అమ్ముకునేలా చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రూ. 120ల బాల్కనీ టిక్కెట్‌ రూ. 200, రూ. 80 బెంచీ టిక్కెట్‌ రూ. 150, రూ.30ల నేల టిక్కెట్‌ రూ.80ల లెక్కన పెంచుకునేలా అనుమతులు జారీ చేసింది.

    సాధారణం కన్నా 100 శాతం ప్రభుత్వమే ధరలు పెంచినా అది చాలదన్నట్లు సినిమా డిస్ట్రిబ్యూటర్లు అంతకు మరో 100 శాతం అంటే బాల్కనీ రూ. 200ల టిక్కెట్టు రూ.350 నుంచి రూ.400లకు ఒక్కొక్క షోను ఇతరులకు విక్రయించేస్తున్నారు. వారి వద్ద షోలు, రోజుల లెక్కన టిక్కెట్లు గుత్తగా కొనుగోలు చేసిన కొందరు రూ.200 టిక్కెట్లను రూ.700 నుంచి రూ. 800, రూ.80 టిక్కెట్లు రూ.300 నుంచి రూ.400, రూ.30 టిక్కెట్లు రూ.200 నుంచి రూ. 300 వరకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. బెనిఫిట్‌ షోలకు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రోజుకు 6 షోలు ప్రదర్శించేలా డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలతోపాటు అమలాపురం, పెద్దాపురం, పిఠాపురం తదితర పట్టణాల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు నిర్వహిస్తున్న లీజు థియేటర్ల వద్ద కూడా డిస్ట్రిబ్యూటర్లు నేరుగా వారే గుత్తగా టిక్కెట్లు బ్లాక్‌లో విక్రయించారు. నగదు డిస్ట్రిబ్యూటర్లు తీసుకుని థియేటర్‌ నిర్వాహకులకు టిక్కెట్లు ఇవ్వాలని సందేశం పంపుతున్నారు.


    రెండు మూడు రోజులకు ప్రదర్శించే టిక్కెట్లు కూడా అయిపోయాయని థియేటర్ల యాజమాన్యాలు, సిబ్బంది చెబుతున్నారు. రాజమహేంద్రవరంలోని కొన్ని థియేటర్లలో అధికారులు, రాజకీయ నాయకులే అథిక ధరలు వెచ్చించి డిస్ట్రిబ్యూటర్ల వద్ద టిక్కెట్లు తీసుకున్నట్లు సమాచారం. అధికారులు, రాజకీయ నాయకులు తమ అనుచరులకు, సన్నిహితులకు ఇవ్వడం కోసం పెద్దమొత్తంలో టిక్కెట్లు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇలా కేవలం 10 శాతం టిక్కెట్లు మాత్రమే బయటకు వెళ్లాయి. మిగిలిన 90 శాతం టిక్కెట్లు బ్లాక్‌ టిక్కెట్లు వ్యాపారం చేసేవారు తీసుకున్నట్లు తెలిసింది. సాధారణ రోజుల్లో సినిమా హాళ్ల వద్ద రూ.10, 20 ఎక్కువకు బ్లాక్‌ టిక్కెట్లు అమ్మేవారికి బాహుబలి సినిమాకు మాత్రం ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. టిక్కెట్లును బ్లాక్‌లో అమ్మి సొమ్ము చేసుకునేందుకు అధికారపార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల అనుచరులు, వారి వద్ద పని చేసేవారు రంగంలోకి దిగారు.

    సినిమా రంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన ఓ ప్రజాప్రతినిధి ఇంట్లో పని చేసే వ్యక్తి రాజమహేద్రవరంలో పేరొందిన థియేటర్‌ టిక్కెట్లను మొదటి రోజుకి అమలాపురానికి చెందిన డిస్ట్రిబ్యూటర్‌ నుంచి తీసుకున్నారు. గురువారం ఉదయం నుంచి రాత్రి 11 గంటలకు వరకు కూడా తన మనుషులను ద్వారా అక్కడే ఉండి టిక్కెట్లు రూ. 800లకు విక్రయిస్తున్నారు. కాగా, థియేటర్ల వద్ద ఈ విధంగా బ్లాక్‌ టిక్కెట్ల దందా యథేచ్ఛగా జరుగుతున్నా క్షేత్రస్థాయిలోని రెవెన్యూ యంత్రాంగం చూసి చూడనట్లు ఉంటోంది. బాహుబలి సినిమాపై పేక్షకుల్లో ఉన్న ఆసక్తిని వారం పది రోజులపాటు బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మి దొచుకునేందుకు నేరుగా డిస్ట్రిబ్యూటర్లే రంగంలోకి దిగడం గమనార్హం. కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్తికేయ మిశ్రాకు అనుకోని మొదటి సవాల్‌గా బాహుబలి సినిమా బ్లాక్‌టిక్కెట్ల వ్యవహారం వచ్చింది. ప్రభుత్వం ఇప్పటికే ధరను 100 శాతం పెంచింది, అయినా ఇలా డిస్ట్రిబ్యూటర్లే బ్లాక్‌లో రూ. 400లకు, వారి వద్ద కొన్నవారు రూ. 800లకు విక్రయిస్తుండడంతో సామాన్య ప్రేక్షకుడు దోపిడీకి గురువుతున్నాడు.

మరిన్ని వార్తలు