భక్త కృష్ణవేణి

17 Aug, 2016 01:43 IST|Sakshi
విద్యుత్‌ కాంతుల్లో బీచుపల్లి పుష్కరఘాట్‌

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : కృష్ణా పుష్కరాల్లో ఐదో రోజు జనప్రవాహం కొంత తగ్గింది. మంగళవారం ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు పనిదినం కావడంతో పుష్కర భక్తులసంఖ్య కొద్ది తగ్గడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు.  గద్వాల సమీపంలోని జూరాల పుష్కరఘాట్‌లో నీళ్లు లేకపోవడంతో ఘాట్‌ను మూసివేశారు. జూరాల ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు వచ్చే వరదనీరు భారీగా తగ్గడంతోపాటు అదే క్రమంలో ప్రాజెక్టునుంచి దిగువ ప్రాంతాలకు నీటి విడుదలను నియంత్రించడంతో పలు ఘాట్లలో నీటిమట్టం భారీస్థాయిలో తగ్గింది. జూరాల పుష్కరఘాట్‌లో మినహా ఎక్కడ పుణ్యస్నానాలు ఆచరించడానికి ఇబ్బంది లేకుండా  అధికారులు ఏర్పాట్లుచేశారు. మరో వారం రోజుల పాటు పుష్కరాలు ఉండడంతో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా ఘాట్లలో నీటిమట్టం ఉండే లా చూడాలని నీటి పారుదల శాఖాధికారులు ఆదేశాలు జారీచేశారు. మంగళవారం సైతం బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల, రంగాపూర్, పస్పుల, నదీ అగ్రహారం, కృష్ణ, పంచదేవులపాడ్, పెద్దచింతరేవుల ఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు.

పుష్కరం..ప్రముఖం
ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ హెచ్‌జె.దొర బీచుపల్లి పుష్కరఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించగా, రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ నేత విజయసాయిరెడ్డి సతీమణి కుటుంబసమేతంగా వచ్చి గొందిమళ్ల పుష్కరఘాట్‌లో పుణ్యస్నానమాచరించి అనంతరం జోగుళాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తొలుత జూరాలలో పుణ్యస్నానమాచరించాలని పర్యటన ఖరారు చేసుకున్నప్పటికీ ఆ ఘాట్‌ నీళ్లు లేవన్న సమాచారంతో రంగాపూర్‌ ఘాట్‌ వద్ద పుణ్యస్నానమాచరించారు. గొంది మళ్లలో మంత్రి లక్ష్మారెడ్డి కుటుంబ సమేతంగా స్నానమాచరించారు. కర్నూల్‌ వైఎస్సార్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక గొందిమళ్ల వీఐపీ ఘాట్‌లో స్నానమాచరించారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నది అగ్రహారంలో సంధ్యా హారతిఇచ్చారు. మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి పలు ఘాట్లను సందర్శించి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కలెక్టర్‌ శ్రీదేవి బీచుపల్లి, రంగాపూర్‌ ఘాట్లను పరిశీలించారు.
బీచుపల్లిలో స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలను పరిశీలించడంతోపాటు అక్షయ పాత్ర ఫౌండేషన్‌ పుష్కర డ్యూటీలో ఉన్న స్వచ్ఛంద సేవకులకు, ఉద్యోగులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్వచ్ఛంద సేవకులతో కలిసి కలెక్టర్‌ మధ్యాహ్న భోజనం చేశారు. అన్ని ప్రాంతాల్లో నది హారతి విధిగా ఇవ్వాలని, హారతి ప్రాధాన్యతను ఆధ్యాత్మిక ప్రశస్తిని ప్రజలకు వివరించాలని ఆమె అధికారులకు సూచించారు. ఇటు సోమశిలలోనూ మంగళవారం భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. మంగళవారం వివిధ ప్రాంతాల్లో పుష్కరస్నానం చేసే భక్తుల రద్దీ కొంత తగ్గడంతో హైవేపై పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలను కొంతమేర సడలించారు. అయితే ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణపై పూర్తిస్థాయి దృష్టి సారించారు.   
నేడు మంచాలకట్టలో వైఎస్‌కు పిండ ప్రదానం
కొల్లాపూర్‌ సమీపంలోని మంచాలకట్ట ఘాట్‌ వద్ద బుధవా రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదా నం చేయనున్నారు. ఉదయం 11 గంట లకు శాస్త్రోకంగా పిండప్రదానం చేయనున్నారు. వైఎస్సార్‌ అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు భగవంత్‌రెడ్డి కోరారు. 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా