బాలాజీ ఆలయానికి కల్యాణశోభ

3 Jun, 2017 22:48 IST|Sakshi
బాలాజీ ఆలయానికి కల్యాణశోభ
నేటి నుంచే తిరు కల్యాణోత్సవాలు
సోమవారం రాత్రి 9.02 గంటలకు కల్యాణం
అప్పనపల్లి (మామిడికుదురు) : నిత్య కల్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లుతూ, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే పరంధాముడిగా పూజలందుకుంటున్న బాల బాలాజీ స్వామి దివ్య క్షేత్రం వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పచ్చని మామిడి తోరణాలు, చలువ పందిళ్లు, విద్యుత్‌ దీపాల కాంతులు, కర్పూర పరిమళాలతో శ్రీవారి ఆలయం కల్యాణ శోభ సంతరించుకుంది. ఆదివారం నుంచి గురువారం వరకు నిర్వహించే కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జ్యేష్ఠ శుద్ధ దశమి ఆదివారం స్వామి వారి కల్యాణోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. స్వామి వారి తిరు కల్యాణం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సోమవారం రాత్రి 9.02 గంటలకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పాంచరాత్ర ఆగమానుసారం కల్యాణం నిర్వహించనున్నట్టు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం ఏసీ, ఈఓ పి.బాబూరావు తెలిపారు.    
గ్రామ చరిత్ర: మూడున్నర దశాబ్ధాల క్రితం అప్పన్న అనే బాలుడు తపస్సు చేసి తరించడం వల్ల ఈ గ్రామానికి ‘అప్పనపల్లి’ అని పేరు వచ్చిందని ప్రతీక. పూర్వం ‘అర్పణేశ్వరుడు’ అనే యతీంద్రుడు పలు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వైనతేయ నదీ తీరాన ఇసుక మేటలు వేసిన ప్రశాంత స్థలంలో ముక్కంటిని ధ్యానిస్తూ శివ సాక్షాత్కారం పొందాడని ఈ అర్పణ ఫలితాలు కాలక్రమేణా ‘అప్పనపల్లి’గా ప్రసిద్ధి చెందాయని మరో కథనం.                                                                         
నూతన ఆలయ నిర్మాణం:
1970 మార్చి 18న నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 1991 జూలై నాలుగో తేదీన టీటీడీ ఉచితంగా సమర్పించిన మూలవిరాట్,  సబ్సిడీపై కొనుగోలు చేసిన  పద్మావతిదేవి, ఆండాళ్‌తాయార్, గరుడాళ్వార్‌ల విగ్రహాలను శ్రీమాన్‌ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు.
ఆలయానికి చేరుకునేది ఇలా...  
స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు రాజమండ్రి నుంచి రావులపాలెం మీదుగా 70 కిలో మీటర్లు ప్రయాణించి తాటిపాక చేరుకోవాలి. కాకినాడ నుంచి అమలాపురం పాశర్లపూడి మీదుగా అప్పనపల్లి చేరుకునే వారికి 64 కిలో మీటర్లు. ఆలయానికి రావడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది.  
>
మరిన్ని వార్తలు