అంగరంగ వైభవంగా బాలబాలాజీ కల్యాణోత్సవం

5 Jun, 2017 22:55 IST|Sakshi
అంగరంగ వైభవంగా బాలబాలాజీ కల్యాణోత్సవం
పులకించిన భక్తజనులు
అప్పనపల్లి(మామిడికుదురు) : భక్తుల కోలాహలం, గోవిందనామ స్మరణ, మంగళవాయిద్యాలు, నయనానందకరంగా అలంకరించిన పూల మండపంలో అప్పనపల్లి పుణ్యక్షేత్రంలో బాలబాలాజీ స్వామి దివ్య తిరు కల్యాణోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. జ్యేష్ట శుద్ధ ఏకాదశి శుభ ముహూర్తం రాత్రి 9.02 గంటలకు ఉభయ దేవేరులను బాలబాలాజీ స్వామి పరిణయమాడారు. కల్యాణానికి ముందుగా స్వామి, అమ్మవార్ల గుణగణాలను వివరిస్తూ నిర్వహించిన రాయబార ఉత్సవం (ఎదుర్కోలు సన్నాహం) కడు రమణీయంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు నడుమ పలు రకాల పుష్పాలతో సుందరంగా రూపొందించిన మంటపంలో శ్రీదేవి, భూదేవిలతో కొలువు తీరిన బాలాజీ స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని చూసి భక్తులు తన్మయత్వం పొందారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ మొల్లేటి శ్రీనివాస్, దేవస్థానం ఏసీ, ఈఓ పి.బాబూరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణోత్సవంలో   
పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఆలయం తరఫన స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అమలాపురం వేంకటేశ్వరస్వామి, అంతర్వేది లక్ష్మీనర్శింహస్వామి ఆలయాలకు చెందిన వేద పండితులు తీసుకువచ్చిన పట్టు వస్త్రాలు స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. రావులపాలేనికి చెందిన మన్యం సుబ్రహ్మణ్యేశ్వరరావు కుటుంబ సభ్యులు మంచి ముత్యాలు, పగడాలు తలంబ్రాలుగా అందజేశారు. ఆలయ ప్రధానార్చకులు మద్దాల తిరుమల శింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామి వారి శిçష్యులు చమలచెర్ల మురళీకృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో కల్యాణం ఆద్యంతం కనుల పండువలా నిర్వహించారు. కల్యాణోత్సవంలో 260 మంది దంపతులు కర్తలుగా పాల్గొన్నారు. శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ నామన రాంబాబు, అమలాపురం ఆర్డీఓ కె.గణేష్‌కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వై.మాలకొండయ్య, జెడ్పీటీసీ సభ్యులు విత్తనాల మాణిక్యాలరావు, గంగుమళ్ల కాశీఅన్నపూర్ణ తదితరులు కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు