అన్నన్నా.. బనానా!

18 Nov, 2016 21:47 IST|Sakshi
అన్నన్నా.. బనానా!
 • బాగా తగ్గిన అరటి ఎగుమతులు, ధరలు
 • రావులపాలెం : 
  పెద్దనోట్ల రద్దు ప్రభావం రావులపాలెం అరటి మార్కెట్‌ యార్డులో ఎగుమతులపై పడింది. చలామణికి అవసరమైన చిల్లర నోట్ల అందుబాటులో లేకపోడంతో వ్యాపారులు పాతనోట్లతోనే కొనుగోళ్లు సాగిస్తుండటంతో సుమారు 25 శాతం ఎగుమతులు తగ్గాయి. సాధారణంగా ప్రతిరోజూ సుమారు 25 లారీల వివిధ రకాల అరటి గెలలను ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేశారు. తద్వారా రూ.20 నుంచి రూ.25 లక్షల వ్యాపారం జరిగేది. అయితే ప్రస్తుతం 15 నుంచి 18 లారీల సరుకు ఎగుమతవుతోంది. తద్వారా రూ.10 నుంచి రూ.15 లక్షల వ్యాపారం జరుగుతున్నట్టు మార్కెట్‌ వర్గాల అంచనా. ధరలు కూడా గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. వరిచేలల్లో కోతలు ప్రారంభం కావడంతో రైతులు అరటి గెలల కోతలపై దృష్టి పెట్టకపోవడంతో మార్కెట్‌కు వచ్చే గెలల సంఖ్య కొంత మేర తగ్గింది. అలాగే అరటి చేలల్లో కూడా 75 శాతం కోతలు పూర్తి కావడంతో దిగుబడి తగ్గింది. వీటితోపాటు తాజాగా రూ.500, వెయ్యి నోట్ల రద్దు చేయడం కూడా ధరలు, ఎగుమతులపై ప్రభావం చూపింది. ఒక లోడు(అరుగెలలు) అమ్మితే వచ్చే మొత్తంలో రైతుకు అధిక శాతం పాత వెయ్యి, రూ. 500 నోట్లను కొంత చిల్లర నోట్లను వ్యాపారులు ఇస్తున్నారు. పాతనోట్లను తీసుకోవడం ఇబ్బందైనా తప్పని పరిస్థితుల్లో రైతులు తీసుకుని బ్యాంకుల్లో మార్చుకొంటున్నారు. అయితే ప్యాకింగ్, లోడింగ్‌ కూలీలకు కూలిగా కూడా రూ.500 నోట్లను ఇస్తుండడంతో వాటిని మార్చుకోవడానికి రూ.50 వరకూ తాము కోల్పోవాల్సి వస్తోందని వారు అంటున్నారు.
   
  రూ. 50 కోల్పోతున్నాం
  కూలీగా ఇస్తున్న నోట్లలో రూ.500 నోటు మార్చుకోవాలంటే రూ.50 కోల్పోవాల్సివస్తోంది.  వ్యాపారులు కొత్త నోట్లు వచ్చేంత వరకూ పాత నోట్లనే తీసుకోక తప్పదని గెలల కొనుగోళ్లకు రైతులకు అవే ఇస్తున్నామని చెబుతున్నారు. 
  – గంధం నాగేశ్వరరావు, ప్యాకింగ్‌ కూలీ, కొమరాజులంక.
  పాత నోట్లతోనే అమ్మకాలు, కొనుగోళ్లు
  నోట్ల రద్దు తర్వాత సరిపడ కొత్త నోట్ల రాకపోవడంతో మార్కెట్‌ యార్డులో అధిక శాతం పాతనోట్లతోనే అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తున్నారు. వ్యాపారులు ఇచ్చిన పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకొంటున్నాం. పరిచయాలతో పాత నోట్లనే ఇచ్చిపుచ్చుకుంటున్నారు.       
  – నడింపల్లి పెద్దిరాజు, రైతు, వెదిరేశ్వరం
   
  ధరలలో వ్యత్యాలు నోట్ల రద్దుకు ముందు ప్రస్తుతం
  రకం(గెల రూ.ల్లో) కనిష్ట గరిష్ట కనిష్ట గరిష్ట
  కర్పూర 150 500 100 250
  చెక్కరకేళీ(తెలుపు) 125 400 100 350
  బుషావళి 100 350 100 250
  బొంత(కూరఅరటి) 150 300 100 250
  అమృతపాణి 200 600 100 300
  చెక్కరకేళీ(ఎరుపు) 150 350 100 300
   
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు