బండ బాదుడు

2 Nov, 2016 22:16 IST|Sakshi
బండ బాదుడు
-గ్యాస్‌ సిలిండర్‌పై రూ.39 పెంపు
-జిల్లా వినియోగదారులపై రూ. 2.10 కోట్లు భారం
తణుకు: నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటితోపాటు తాజాగా గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు గుదిబండగా మారింది. సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌పై ఏకంగా రూ.39 పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో సామాన్యులకు పెనుభారమయ్యింది. పెరిగిన ధరతో జిల్లాలోని వినియోగదారులపై నెలకు రూ.2.10 కోట్లు మేర భారం పడనుంది. పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతున్న చమురు కంపెనీలు తాజాగా రాయితీ గ్యాస్‌ సిలెండర్లపై భారం మోపడం సమంజసం కాదని మధ్యతరగతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
జిల్లాపై భారం...
జిల్లాలో మొత్తం 7.50 లక్షల మంది గ్యాస్‌ వినియోగదారులు ఉన్నారు. వీరిలో సుమారు 2 లక్షల మంది దీపం గ్యాస్‌ కనెక్షన్లు కలిగి ఉన్నారు. హెచ్‌పీ, భారత్, ఇండేన్‌ గ్యాస్‌ డిస్టిబ్యూటర్‌ కేంద్రాలు 42 ఉండగా వీటి ద్వారా ప్రతి నెలా 5.40 లక్షల గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. రోజుకు దాదాపు 50 వేల మంది సిలిండర్‌  బుకింగ్‌ చేసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సబ్సిడీపై ఇస్తున్న గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ.537 కాగా నగదు బదిలీ కింద వినియోగదారుల ఖాతాలో రూ. 72 చొప్పున రాయితీ మొత్తం జమ అవుతోంది. ఈనెల 1 నుంచి రాయితీపై పంపిణీ చేసే గ్యాస్‌ సిలిండర్‌పై రూ.39 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. స్థానిక పన్నులన్నీ కలిపితే పెంచిన ధరతో కలిపి గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ.576కు చేరింది. ఈ లెక్కన జిల్లా వినియోగదారులపై దాదాపు రూ.2.10 కోట్ల భారం పడనుంది.
 
ధరలు పెంచడం దారుణం
పప్పుల ధరలు ఆకాశాన్నంటడంతో వంటింటి బడ్జెట్‌ పెరిగింది. ఇలాంటి సమయంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచడం దారుణం. ఆదాయానికి ఖర్చులకు పొంతన ఉండటం లేదు. ధరలు ఇలా పెంచుకుంటూ వెళితే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎలా బతికేది. 
ఎం.సరస్వతి, గృహిణి, తణుకు
 
ఎలా బతికేది..
కార్తీకమాసం కావడంతో ఇప్పటికే కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతోపాటు ఇటీవల పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచేశారు. దీనికి తోడు ఇప్పుడు గ్యాస్‌ సిలెండర్‌ ధరను ప్రభుత్వం పెంచేసింది. ఇలా ధరలు పెంచుకుంటూపోతే ఎలా బతికేది.?
కె.నాగమణి, గృహిణి, దువ్వ
 
మరిన్ని వార్తలు