పెళ్లి వేడుక... గాజుల కానుక

9 Aug, 2017 22:59 IST|Sakshi
పెళ్లి వేడుక... గాజుల కానుక
 అమలాపురం టౌన్‌ :ఆడంబరాలదే పైచేయి అవుతున్న నేటి వివాహ తంతులో సంప్రదాయానికి పెద్దపీట వేసి అందరినీ ఆకట్టుకున్నారు వంటెద్దు నారాయణ స్వామి. ఎన్ని పిండివంటలు పెట్టామా? ఎంత అట్టహాసంగా వివాహం చేశామా? అని తలపోస్తున్న ఈ ఆధునిక కాలంలో సంప్రదాయానికి ఆయన ఊపిరులూదారు. ఒకప్పుడు ఏ ఇంటైనా పెళ్లి జరుగుతుంటే ఆ ఉళ్లో ముత్తైదువలందరినీ ఇంటికి సాదరంగా ఆహ్వానించి గాజుల మూటలతో ఊరూరా...తిరిగి అమ్మే గాజులమలారం వారిని రప్పించి అందరికీ గాజులు తొడిగించేవారు. ఆ సంప్రదాయ వేడుకనే ‘గాజుల కానుక’ అంటారు. ఆ సంప్రదాయాన్నే నారాయణ స్వామి తన కుమారుడి వివాహంలో పునరుద్ధరించారు. ఆ విశేషాన్నే వివాహ ఆహ్వాన పత్రికపై ముద్రించడం విశేషం. వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరంలో రైల్వే ఉద్యోగిగా పని చేసి ఇటీవలే వంటెద్దు నారాయణ స్వామి పదవీవిరమణ చేశారు. నారాయణస్వామి, సుబ్బలక్షి ‍్మ దంపతుల కుమారుడు శ్రీరామ భూషణం అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అతని వివాహం ఈనెల 11న జరగనుంది. ఆ సందర్భంగా అమలాపురంలోని వంటెద్దువారి వీధిలో తమ ఇంటికి ఆవీధి, కల్వకొలనువారి వీధిలలోని ముత్తైదువలను పిలిపించి గాజుల వేడుక కన్నుల పండువగా నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి గతంలో గాజుల అమ్మేవారిని తీసుకు వచ్చారు. అనేక రకాల గాజులను ప్రదర్శనగా ఉంచారు. వాటిని ముత్తైదువులకు తొడిగించారు. కనుమరుగైపోయిన ‘గాజుల పండుగ’ను సంప్రదాయబద్దంగా చేసిన నారాయణస్వామి దంపతులను ఆ  ముత్తైదువలు అభినందించారు.  
మరిన్ని వార్తలు