బ్యాంకు ఉద్యోగుల సమ్మె​ సక్సెస్‌

1 Mar, 2017 00:42 IST|Sakshi

అనంతపురం సెంట్రల్‌ : ప్రభుత్వ రంగ బ్యాంకులను నిర్వీర్యం చేసే కుట్రను వ్యతిరేకిస్తూ యూనైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంకు యూనియన్‌ పిలుపు మేరకు జిల్లాలో చేపట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. దాదాపు మూడు వేల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. సాయినగర్‌లోని ఎస్‌బీఐ వద్ద మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో బ్యాంకు ఎంప్లాయీస్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ అధ్యక్షులు రుషేంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా, బ్యాంకు ఉద్యోగుల వ్యతిరేకమైన సంస్కరణలు చేపడుతోందని ఆరోపించారు.

రూ.90 లక్షల కోట్లు ప్రజాధనం స్వదేశీ, విదేశీ కంపెనీల పరం చేయడానికి కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. బ్యాకింగ్‌ రంగం ప్రైవేటు దిశగా సాగుతోందని, పారిశ్రామిక తమకు అనుకూలంగా సవరించుకుంటోందని హెచ్చరించారు. కోట్లాది మంది బ్యాంకు ఉద్యోగులు, ప్రజల హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. బ్యాంకు ఉద్యోగులు ఐక్యమత్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెద్దనోట్ల రద్దు ద్వారా బ్యాంకులకు ఏర్పడిన లోటును భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే బ్యాంకు ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని, బ్యాంకుల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగుల సంఘాల నాయకులు మున్వర్‌బాషా, ఖాధర్‌బాషా, వీరభద్రారెడ్డి, శివకృష్ణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు