గిరిజనులపై దుందుడుకు వైఖరి తగదు

12 Dec, 2016 15:08 IST|Sakshi
గిరిజనులపై దుందుడుకు వైఖరి తగదు
రాజవొమ్మంగి ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌పై
అఖిల పక్ష నాయకుల నిరసన, రాస్తారోకో
పరిష్కారానికి డీజీఎం హామీతో పరిస్థితి ప్రశాంతం
రాజవొమ్మంగి : రాజవొమ్మంగి ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌ జనార్థన్‌ దుందుడుకు వైఖరిని నిరసిస్తూ ఖాతాదారులు, అఖిలపక్ష నేతలు గురువారం ఆందోళనకు దిగారు. దాదాపు రెండు గంటలకు రాస్తారోకో చేశారు. గిరిజనులను విసుక్కోవడం, పాస్‌ పుస్తకాలను విసిరికొట్టడం వంటి చర్యలతో రెండేళ్లుగా వేధిస్తున్నాడని ధ్వజమెత్తారు. తొలుత ఖాతాదారులు మేనేజర్‌ను కలసి మీ పద్ధతిని మార్చుకోవాలని కోరారు. ఇప్పటికే పెద్దనోట్లు చెల్లక ఖాతాదారులు, స్థానిక గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనికి తోడు మీ తీరు మరింత బాధిస్తున్నదని వివరించారు. దీనితో మేనేజర్‌ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి తనకు రక్షణ కోరారు. పోలీసులు ఆప్రాంతానికి రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో మేనేజర్‌ తీరును నాయుకులు, స్థానికులు సీఐ కేఎన్‌. మోహనరెడ్డి, తహశీల్దార్‌ పద్మావతి, ఎస్సై రవికుమార్‌లకు వివరించారు. అలాగే మేనేజర్‌ జనార్దన్ను‌ కలసి అధికారులు సమస్య అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఆంధ్రాబ్యాంకు డీజీఎంను ఫోన్లో‌ సంప్రదించి ఆందోళన వివరించారు. దీనితో శుక్రవారం తాను స్వయంగా రాజవొమ్మంగి వచ్చి పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇవ్వడంతో ఆందోళన కారులు తమ నిరసనను తాత్కాలికంగా విరమించారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు దాట్ల వేంకటేష్‌రాజు, చప్పా నూకరాజు, పార్టీ నేతలు శాంతకుమారి, చీడిపల్లి అప్పారావు, ముప్పన మోహన్ కుమార్‌, చప్పా నూకరాజు, బీజేపీ మండల అధ్యక్షుడు చింతలపూడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు