దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్‌ రంగమే వెన్నెముక

7 Apr, 2017 20:06 IST|Sakshi

► ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి

న్యూశాయంపేట: భారత దేశ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకింగ్‌ రంగం వెన్నెముక అని, బ్యాంకింగ్‌ రంగంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం సామన్యుడు సైతం అర్థం చేసుకున్నప్పుడే సార్థకత అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ టి.పాపిరెడ్డి అన్నారు. గురువారం ఖిలావరంగల్‌ మండలం బొల్లికుంట వాగ్దేవి కళాశాలలో ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సెమినార్‌కు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. టెక్నాలజీ ఇన్నోవేషన్స్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ ఇన్‌ ఇండియా అనే అంశంపై ఈ సదస్సు జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచీకరణ ప్రభావం బ్యాంకింక్‌ రంగంపై ఉందన్నారు. ఫలితంగా ప్రైవేటు బ్యాంకులు ఆవిర్భవించాయని, వినియోగదారులకు సేవలందించడంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల మధ్య పోటీతత్వం పెరిగిందన్నారు. ఇటీవల సైబర్‌ మోసాలు ఎక్కువైన నేపథ్యంలో సామాన్యులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మేనేజ్‌మెంట్‌ విద్యార్థులపై ఉందన్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ శంకరయ్య మాట్లాడుతూ కంప్యూటరైజేషన్‌ వల్ల బ్యాంకింగ్‌ సేవలు వేగవంతమై వినియోగదారులు సులభమైన సేవలు పొందుతున్నారన్నారు. ఈ సదస్సులో తెలంగాణలోని వివిధ ఎంబీఏ విద్యాసంస్థల నుంచి 80 మంది అధ్యాపకులు, విద్యార్థులు పలు అంశాల్లో పత్ర సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో కేయూ ప్రిన్సిపాల్‌ శర్మ, ఆంధ్రాబ్యాంక్‌ ఏజీఎం సూర్యనారాయణ, వాగ్దేవి విద్యాసంస్థలపాలనాధికారి సత్యపాల్‌రెడ్డి, డైరెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి, ప్రిన్సిపాల్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు