బార్‌లపై ఉన్న శ్రద్ధ బడులపై లేదు

21 Jul, 2016 00:48 IST|Sakshi
బార్‌లపై ఉన్న శ్రద్ధ బడులపై లేదు
  • విద్యార్థుల జీవితంతో ప్రభుత్వం చెలగాటం
  • టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి
  • కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన
  • ఖమ్మం అర్బన్‌ : విద్యాహక్కులను కాలరాస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. బార్‌లపై ఉన్న శ్రద్ధ బడులపై లేదని మండిపడ్డారు. బుధవారం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంస్థలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా నేటికీ కనీస వసతుల కల్పనలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎంసెట్‌–2 మెడికల్‌ స్కాంలో అధికార టీఆర్‌ఎస్‌ నేతల హస్తం ఉందని, తక్షణం వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న కేసీఆర్‌.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించాడని ఆరోపించారు. సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఎంతసేపు మిషన్‌ కాకతీయ, భగీరథ, హరితహారంపైనే ప్రభుత్వం దృష్టి మళ్లించిందని పేర్కొన్నారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు మొదటివారంలో హైదరాబాద్‌లోని సీఎం కేసీఆర్‌ క్యాంప్‌ కార్యాలయాన్ని వేలాదిమంది విద్యార్థులతో దిగ్బంధిస్తామని హెచ్చరించారు. కాగా, కలెక్టరేట్‌ వద్ద పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. 35 మందిని అరెస్ట్‌ చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సుమంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, నాయకులు అభిరామ్, నటరాజ్, మంగీలాల్, అభినవ్, శ్రీనివాస్, అక్బర్, రమేష్, నరేంద్ర, రాము, ఆశోక్, రాజశేఖర్, శ్రీకాంత్, గోపాల్, రత్నాకర్, గోపి పాల్గొన్నారు.

    పోటోరైటప్‌20సీకెఎం204 : ధర్నా చేస్తున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

మరిన్ని వార్తలు