పండగ రోజూ...అదే హోరు

10 Aug, 2013 01:27 IST|Sakshi
పండగ రోజూ...అదే హోరు
పండగరోజూ జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఉద్యమ జోరు.. హోరు కొనసాగింది. పదోరోజైన శుక్రవారం ఆందోళనలకు విరామం ఇవ్వాలని జేఏసీ నిర్ణయిం చినా స్వచ్ఛంద ఆందోళనలు వెల్లువెత్తాయి. రంజాన్ పవిత్ర పర్వదినాన్ని జరుపుకొనే తరుణంలోనూ ముస్లింలు ప్రత్యక్ష ఆందోళనల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 
 
సాక్షి, విజయవాడ : రంజాన్ పండగ రోజు కావడంతో ప్రత్యక్ష ఆందోళనలకు విరామం ఇవ్వాలని జేఏసీ నిర్ణయించినా జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉన్న మంత్రి పార్థసారథి శుక్రవారం తన నియోజకవర్గంలో పర్యటించారు. సమైక్య ఆందోళనలకు మద్దతు ప్రకటించి, సమైక్యవాదినేనని చెప్పుకున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేలా కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నామని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి కేంద్ర మంత్రులను నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తన అభిమతమని తెలిపారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రజల వాదనను ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. తన రాజీనామా విషయంపై మాత్రం నోరు మెదపలేదు. 
 
 పెరుగుతున్న మద్దతు...
 
 ఏపీ ఎన్జీవోలు ప్రకటించిన సమ్మెకు మద్దతు పెరుగుతోంది. గ్రంథాలయ ఉద్యోగులు సంఘం సమైక్యాంధ్రకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. వారు కూడా 12 అర్ధరాత్రి నుంచి నిర్వహించ తలపెట్టిన నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు తెలిపారు. జేఏసీ పిలుపు మేరకు సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల ఎంపీడీఓలు 630 మంది నిరవధిక సమ్మెకు వెళుతున్నారని రాష్ట్ర ఎంపీడీఓల అసోసియేషన్ అధ్యక్షుడు వై హరిహరనాథ్ ప్రకటించారు. విజయవాడ చిట్టినగర్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరగా, గజల్ శ్రీనివాస్ వాటికి మద్దతు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు తమ నిరసన కార్యక్రమాలను చట్టాలకు లోబడే చేసుకోవాలని ఒకవేళ వాటిని అతిక్రమించి రైళ్ల రాకపోకలను అడ్డుకునేందుకు రైలు పట్టాలపైకి వెళ్తే నాన్‌బెయిలబుల్ కేసులు ఎదుర్కోవడంతో పాటు జైలుకు వెళ్లవలసి వస్తుందని విజయవాడ రైల్వే ఎస్పీ డాక్టర్ సీహెచ్ శ్యామ్‌ప్రసాద్ హెచ్చరించారు. 
 
 రహదారిపై భజనలు..
 
 పెనుగంచిప్రోలులో సమైక్యాంద్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినూత్నంగా రహదారిపై కూర్చుని భజనలు చేశారు. భజనల్లో శ్రీఅయ్యప్ప, అమ్మవారు, శివ దీక్షా స్వాములు పాల్గొని మద్దతు తెలిపారు. తిరువూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలేదీక్షలు ప్రారంభమయ్యాయి. సమైక్యాంధ్ర కోరుతూ పామర్రులో ముస్లింలు ధర్నా చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ఎమ్మెల్యే డీవై దాసు మద్దతు తెలిపారు. మైలవరంలోనూ ముస్లీంలు భారీ ర్యాలీ నిర్వహించారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. కలిదిండి ప్రధాన సెంటర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో 20 మంది రిలే దీక్షలు చేపట్టారు. అవనిగడ్డలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన విషయంలో సోనియా మనసు మారాలని కోరుతూ ఉయ్యూరు శివాలయంలో యాగం నిర్వహించారు. ఉయ్యూరు సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో ఒంటికాలిపై నిరసన జపం చేశారు.  
 
కేసీపీ కార్మికులు, ఉయ్యూరు దళితవాడ వాసులు రిలేదీక్షల్లో పాల్గొని సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యమించారు. కంకిపాడు ఈద్గా నుంచి ముస్లిం సోదరులు ప్రదర్శనగా కంకిపాడు సెంటరుకు చేరుకుని మానవహారం నిర్వహించారు. ఈడుపుగల్లు-గోసాల సెంటరులో రైతులు, కూలీలు, ముస్లిం సోదరులు వరి నారు చేత బట్టి ఆందోళన జరిపారు. కంకిపాడులో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నూజివీడు జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక చిన్నగాంధీబొమ్మ సెంటరులో రిలేనిరాహారదీక్షలు జరిగాయి. ట్యాక్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో కార్ల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన అనేది కేవలం సోనియాగాంధీ తన కుమారుడిని ప్రధానమంత్రిని చేయాలన్న స్వార్థంతోనే జరుగుతోందని పేర్కొంటూ పట్టణంలోని కుమార్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన వీధినాటిక ప్రజలను ఆకట్టుకుంది.
 
మరిన్ని వార్తలు