‘మరుగు’న పడేశారు!

19 Jul, 2016 23:41 IST|Sakshi
నీరులేక మండలరెవెన్యూ కార్యాలయ బోరుకు వచ్చి దుస్తులు ఉతుక్కుంటున్న గురుకులం విద్యార్థులు
 రూ. కోట్లు గుమ్మరించినా కానరాని మరుగుదొడ్లు 
 బాలికల ఆశ్రమ పాఠశాలల్లో మరీ దారుణం 
 పట్టించుకోని పాలకులు
 
ఆశ్రమ పాఠశాలల విద్యార్థులను మరుగుదొడ్ల సమస్య వెంటాడుతోంది. కోట్లాది రూపాయల ఖర్చుతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని పాలకులు, అధికారులు చెబుతున్న మాటలకు..వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. బాలికల ఆశ్రమాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అత్యవసర సమయంలో పిల్లలు మరుగు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలోని 46 ఆశ్రమాల్లో ఇదే పరిస్థితి. ఎంతో ముఖ్యమైన ఈ సమస్యను పరిష్కరించకుండా మరుగున పడేయడంపై పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
సీతంపేట: గిరిజన విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా ఆశ్రమ పాఠశాలలకు అదనపు భవనాలు, మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణం, మంచినీటి సౌకర్యాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా అవి మాటలకే పరిమితమవుతున్నాయి. ఎక్కడా వాటి ఆనవాళ్లు కానరావడం లేదు. ఇలాంటి పరిస్థితిలో మరుగుదొడ్డికి వెళ్లాలంటే పిల్లలకు చుక్కలు చూడాల్సిన పరిస్థితి. బాలికల ఆశ్రమపాఠశాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హడ్డుబంగి గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం సక్రమంగా లేదనే ఉద్దేశంతో ఇక్కడ చదువుకోలేమని విద్యార్థినులు తేల్చి చెప్పారంటేSపరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
 
నిబంధనలు ఇలా..
 
 వాస్తవానికి పది మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి ఉండాలి. కానీ 30 మందికి కూడా ఒకటి లేని పరిస్థితి. జిల్లాలో 46 ఆశ్రమ పాఠశాలలు, నాలుగు గురుకుల పాఠశాలలు, మూడు జూనియర్‌ కళాశాలలు, మూడు కేజీబీవీ, రెండు మినీగురుకులాలు, 22 పోస్ట్‌మెట్రిక్‌వసతిగృహాలున్నాయి. వీటిలో సుమారు 20 వేల మంది గిరిపుత్రులు చదువుతున్నారు. వారికి సరిపడా మరుగుదొడ్లు మాత్రం లేవు.
 
రూ.2 కోట్లపైనే వ్యయం
ఆశ్రమ పాఠశాలల్లో వివిధ పథకాల ద్వారా మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కోసం గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ విభాగం సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అయితే చాలాచోట్ల పూర్తిగా మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించిన దాఖలాలు లేవు. హడ్డుబంగి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమపాఠశాలలో 650 మంది చదువుతున్నారు. ఇక్కడ ఉన్న మరుగుదొడ్లు పూర్తిగా పాడవ్వడంతో అత్యవసర సమయంలో ఇబ్బంది పడుతున్నారు.  సీతంపేట బాలికల ఆశ్రమపాఠశాలలో 650 మంది విద్యార్థినులు ఉండగా.. 20 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. మరో 20 వరకు అవసరం ఉంది. పూతికవలసలో 520 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఇక్కడ ఉన్న 20 మరుగుదొడ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. ఐటీడీఏ ప్రాంగణంలో బాలుర గురుకుల పాఠశాలలో 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరుగుదొడ్లు ఉన్నప్పటికీ రన్నింగ్‌ వాటర్‌ లేదు. ఒకే బోరు ఉండడంతో విద్యార్థుల స్నాన్నాలకు నీరు చాలడం లేదు. దోనుబాయి గిరిజన సంక్షేమ బాలుర వసతిగృహంలో 20 వరకు మరుగుదొడ్లు ఉన్నా, రన్నింగ్‌ వాటర్‌ సౌకర్యం లేదు. సామరెల్లిలో అదే పరిస్థితి. మిగిలిన ఆశ్రమాల్లో కూడా ఇదే దుస్థితి ఉన్నా సమస్యను పరిష్కరించేందుకు పాలకులు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
 
కొత్త మరుగుదొడ్లు కడుతున్నాం
 
అవసరమైన చోట కొత్తగా మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం. పాడైన వాటిని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ శాఖ ద్వారా బాగు చేయిస్తున్నాం. మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. రన్నింగ్‌ వాటర్‌ సౌకర్యం కల్పిస్తాం.
– ఎంపీవీ నాయిక్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ 
 
 విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు
 
 మరుగుదొడ్డి సౌకర్యం లేక అవస్థలు తప్పడం లేదు. విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లు నిధులు దోచేస్తున్నారు తప్ప విద్యార్థులకు ఉపయోగ పడే నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టడం లేదు. ఇంత దారుణమైన పరిస్థితిని నేనెక్కడా చూడలేదు. 
– విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే 
 
 
మరిన్ని వార్తలు