భాగ్యనగరంలో బ్యాటరీ బస్సులు

10 Dec, 2015 04:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర రోడ్లపై త్వరలో ఎలక్ట్రిక్ హైబ్రిడ్ (బ్యాటరీ ఆధారిత) బస్సులు పరుగుపెట్టనున్నాయి. తొలుత ప్రయోగాత్మకంగా నాలుగైదు బస్సులు రానున్నాయి. ఆ ప్రయోగం సత్ఫలితాన్నిస్తే అవసరానికి తగ్గట్టుగా కొనాలని ఆర్టీసీ భావిస్తోంది. ప్రయోగాత్మకంగా వచ్చే బస్సులను కేంద్ర ప్రభుత్వం కేటాయించనుండగా, తదుపరి ఆర్టీసీ సొంత నిధులతో కొననుంది. వాటికి కూడా కేంద్రం సబ్సిడీ ఇవ్వనుంది. దీనికి సంబంధించి కొద్దిరోజుల్లో స్పష్టత రానుంది. ఇంధ న ఖర్చును తగ్గించుకునేందుకు ఇంధనంతో పనిలేని బ్యాటరీ ఆధారిత బస్సులు ఎంతో మేలని కేంద్రం చెబుతుండటంతో టీఎస్‌ఆర్టీసీ దానివైపు మొగ్గుచూపింది.

పెరిగిపోతున్న వాయు కాలుష్యానికి కళ్లెం వేయటానికి కూడా ఇది దోహదపడుతుంది. దేశంలో బ్యాటరీ వాహనాల వినియోగాన్ని పెంచాలంటూ కేంద్రం ప్రత్యేకంగా ‘ఫేమ్-ఇండియా (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా) కార్యక్రమాన్ని తెచ్చింది. దేశీయంగా ఆ తరహా వాహనాల తయారీని ప్రోత్సహిస్తోంది.  ఇప్పటికే మారుతి సుజుకీ, టాటా, అశోక్‌లేలాండ్, మహీంద్రా లాంటి కంపెనీలు అందుకు సిద్ధమయ్యాయి.

 పాత బస్సులకూ ‘బ్యాటరీ’లు: ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బస్సు ధర (లోఫ్లోర్ నమూనా)  రూ.1.70 కోట్ల వరకు ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం ఓల్వో కంపెనీ నుంచి 80 సిటీ ఏసీ బస్సులను కొన్నప్పుడు ఒక్కో దానికి రూ.1.10 కోట్లు వ్యయం చేసింది. దీనికంటే బ్యాటరీ బస్సుల ధర ఎక్కువ. అయితే కేంద్రం సబ్సిడీ ఇవ్వనున్నందున ఖర్చు కొంతవరకు కలిసి వస్తుంది.  డీజిల్ బస్సులను కూడా బ్యాటరీ నమూనాలోకి మార్చే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున... పాత బస్సులను వాటిలోకి మార్చేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. బ్యాటరీలను చార్జ్ చేసేందుకు ప్రత్యేకంగా పరికరాలు అవసరం. వాటికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దానికి కూడా సబ్సిడీ కోసం కేంద్రంతో చర్చించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఢిల్లీలో ఏర్పాటు చేసిన సదస్సుకు రాష్ట్రం అధికారులను పంపింది.

మరిన్ని వార్తలు