బీసీలు సంఘటితం కావాలి

12 Mar, 2017 23:07 IST|Sakshi
బీసీలు సంఘటితం కావాలి
కాపులను బీసీల్లో చేర్చితే రోడ్డెక్కి ఉద్యమాలు
22న చలో కాకినాడకు సన్నాహక ఏర్పాట్లు
రాష్ట్ర బీసీ కులాల జేఏసీ కన్వీనర్‌ సూర్యనారాయణరావు 
అమలాపురం టౌన్‌ : కాపులను బీసీల్లో చేర్చితే సహించేది లేదని... అదే జరిగితే బీసీలు రోడ్డెక్కి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయని రాష్ట్ర బీసీ కులాల జేఏసీ కన్వీనర్‌ కుడుపూడి సూర్యనారాయణరావు స్పష్టం చేశారు. ఇందుకోసం బీసీలంతా సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అమలాపురంలోని శెట్టిబలిజ సంఘం భవనంలో ఆదివారం సాయంత్రం జరిగిన జిల్లా బీసీ కులాల ప్రతినిధుల సమావేశానికి కుడుపూడి అధ్యక్షత వహించి ప్రసంగించారు. రాష్ట్ర బీసీ జేఏసీ ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరై ఈనెల 22న జిల్లాకు మంజునాథ కమిషన్‌ వస్తున్న సందర్భంగా నిర్వహించనున్న చలో కాకినాడ కార్యక్రమంలో ప్రతి బీసీ సామాజిక వర్గీయుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాపులను బీసీల్లో ఎందుకు చేర్చకూడదో..చేర్చితే బీసీలకు నష్టాలు ఎలా ఉంటాయో గణాంకాలతో సహా కమిషన్‌కు వివరించాలని బీసీ జేఏసీ నేతలు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. కాపులను బీసీల్లో చేర్చితే తమ అభ్యంతరాలతో వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ఉన్నత న్యాయస్థానాల్లో కేసులు వేసేందుకు కూడా బీసీలు సిద్ధం కావాలని సూచించారు. బీసీలను అణగదొక్కటానికే కాపులను రంగంలోకి దించారని ఆరోపించారు. ఇది చంద్రబాబు పన్నుతున్న కుట్రగా అభివర్ణించారు. సూర్యనారాయణరావు మాట్లాడుతూ బీసీల్లో నేటికీ వెలుగులోకి రాని దాదాపు 40 సంచార జాతుల ఉనికి గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. బీసీలకు రుణాలు, రాయితీలు వద్దని...రాజ్యాధికారాన్ని అందుకునే రిజర్వేషన్లు సంపూర్ణంగా కల్పించాలని డిమాండ్‌ చేశారు. సంచార జాతుల వారికి కనీసం ఆధార్‌ కార్డులు కూడా ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయటంలేదని ధ్వజమెత్తారు. ఆ జాతుల వారిని గుర్తించి ప్రభుత్వమే ఉన్నత విద్య, కార్పొరేట్‌ స్థాయి వసతులు కల్పించాలని రాష్ట్ర గంగిరెడ్ల సామాజిక సంఘం నాయకుడు అమ్మోరు అన్నారు. రాష్ట్ర బీసీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, బీసీ నేతలు గుత్తుల సాయి, చెల్లుబోయిన శ్రీనివాసరావు, మల్లాడి సత్తిబాబు, గుత్తుల శ్రీనివాసరావు, కుడుపూడి బాబు, వాసంశెట్టి సత్యం, యిళ్ల సత్యనారాయణ, అనుపోజు శ్రీనివాస్, పట్నాల వెంకటరమణ, దొమ్మేటి రాము, బండి రాధమ్మ తదితరులు ప్రసంగించారు. 22న చలో కాకినాడ కార్యక్రమం సన్నాహక ఏర్పాట్లపై సమావేశం విస్తృతంగా చర్చించింది.
>
మరిన్ని వార్తలు