బీసీ రిజర్వేషన్లకు భంగం లేకుండా కాపుల పోరాటం

17 Dec, 2016 08:20 IST|Sakshi
  • అమలాపురంలో బీసీ నేత చిట్టబ్బాయిని కలిసిన కాపు జేఏసీ బృందం
  • అమలాపురం రూరల్‌ : ప్రస్తుతం బీసీలకు ఉన్న రిజర్వేషన్ల వాటాకు ఏ మాత్రం భంగం కలగకుండా కాపులు తమకు గతంలో అమలైన రిజర్వేషన్లు పునరుద్ధరించమని మాత్రమే పోరాటం చేస్తున్నారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ విషయంలో బీసీలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ముద్రగడతో కూడిన కాపు జేఏసీ బృందం అమలాపురంలోని బీసీ నేత, రాష్ట్ర వైఎస్సార్‌ సీపీ సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయి ఇంటికి శుక్రవారం వెళ్లి చర్చించింది.

    ఈ సందర్భంగా చిట్టబ్బాయితో ముద్రగడతో పాటు కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి, వాసిరెడ్డి ఏసుదాసు, మిండగుదిటి మోహన్, ఆర్వీ నాయుడు మాట్లాడుతూ బ్రిటిషు కాలం, నిజాం కాలం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి అమలైన కాపుల రిజర్వేషన్లను పునరుద్ధరించాలని మాత్రమే కోరుతున్నామని స్పష్టం చేశారు. బీసీలకు ప్రస్తుతం అమలవుతున్న వాటాలో మేము రిజర్వేషన్లు ఆశించటం లేదని తెలిపారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న బీసీ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, రాజులపూడి భీముడు, మట్టపర్తి నాగేంద్ర, కొరశిఖ సుబ్రహ్మణ్యం, ముప్పిడి శ్రీనివాస్, సంసాని నాని, వాసంశెట్టి సుభాష్, వాసంశెట్టి తాతాజీ, కుడుపూడి జిజ్జి ముద్రగడతో చర్చించారు.

    రాజకీయ రిజర్వేషన్లలో తమకు నష్టం జరుగుతోందన్నారు. ఏబీసీడీ నిష్పత్తితో తమ వాటా అడుగుతున్నామని కాపు నేతలు వివరణ ఇచ్చారు. తమ సామాజిక వర్గాల్లో నిరుపేదలు ఉన్నారని వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసమే ఉద్యమిస్తామని కాపు నేతలు వివరించారు. అనంతరం రాష్ట్ర కాపు రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి స్వగృహానికి వెళ్లిన ముద్రగడకు రాష్ట్ర కాపు జేఏసీ నాయకుడు నల్లా పవన్, కాపునాయకులు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శులు సుంకర సుధ, జక్కంపూడి వాసు,  పట్టణ పార్టీ యువజన అధ్యక్షుడు నల్లా శివాజీ, రూరల్‌ మండల పార్టీ కార్యదర్శి సూదా గణపతి,  జిల్లా పార్టీ నాయకుడు బండారు కాశి, జిల్లా బీజేపీ కార్యదర్శి పాలూరి సత్యానందం, కోనసీమ కాపు సంఘం నాయకులు కురస ఆంజనేయులు, పత్తి దత్తుడు, శిరిగినీడి వెంకటేశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు.  
     
మరిన్ని వార్తలు