'విశాఖలో త్వరలో టెస్టు మ్యాచ్లు'

30 May, 2016 20:19 IST|Sakshi

విజయవాడ : దేశంలోని ఏళ్ల నాటి క్రికెట్ మైదానాలను కూడా హరిత మైదానాలుగా మారుస్తామని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇందుకోసం బీసీసీఐ రూ.100 కోట్ల నిధులు ఖర్చుచేస్తుందన్నారు. ఏసీఏ, కేడీసీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని మూలపాడులో ట్విన్ క్రికెట్ గ్రౌండ్స్‌ను, మంగళగిరిలోని ఇండోర్ క్రికెట్ అకాడమీని సోమవారం ఆయన ప్రారంభించారు. అన్ని స్టేడియాలను హరిత మైదానాలుగా తయారు చేయడంతో పాటు వర్షపునీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తామన్నారు. వాడిన నీటిని శుద్ధి చేసి రీ-సైక్లింగ్ ద్వారా వాడడం, విద్యుత్ ఆదా కోసం సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం, ఎల్‌ఈడీ బల్బులు వాడడం వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు.

ఒక్క క్రికెట్‌లోనే కాకుండా అన్ని ఆటలకు సంబంధించిన అసోసియేషన్లు, ఫెడరేషన్లకు ప్రపంచంలోనే బీసీసీఐ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేశంలో తొలి ఉమెన్ క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసిన ఘనత కూడా ఏసీఏదేని ప్రశంసించారు. విశాఖట్నం స్టేడియంలో త్వరలోనే టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. మ్యాచ్‌ల నిర్వహించే వేదికలు ఖరారు చేసేందుకు వేసిన కమిటీకి ఏసీఏ ప్రధాన కార్యదర్శి గంగరాజు చైర్మన్ కావడంతో... ఆయన ఎప్పుడు కేటాయిస్తే అప్పుడు విశాఖపట్నంలో టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయని చమత్కరించారు. మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, మూలపాడు ట్విన్ గ్రౌండ్స్ కొత్త రాజధానికి తలమానికం కానున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై భారం లేకుండా రాజధాని ఏర్పాటుకు ముందే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

పూనే, నాగపూర్, ముంబాయి వంటి చోట్ల ఐపీఎల్ మ్యాచ్‌లు రద్దయితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెంటనే ముందుకొచ్చి విశాఖపట్నంలో ఆరు మ్యాచ్‌లు నిర్వహించిందని కొనియాడారు. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్ష,కార్యదర్శులు అనురాగ్‌ఠాకూర్, షిర్కే కొద్ది సేపు బ్యాటింగ్ చేసి భారీ షాట్లతో అలరించారు. అనంతరం ఎంపీలు అనురాగ్ ఠాకూర్, గోకరాజు గంగరాజు, కేశినేని నాని, గల్లా జయదేవ్ నలుగురూ సెల్ఫీలతో సందడి చేశారు. చిన్నారులతో అనురాగ్ ఠాకూర్ సెల్ఫీని తానే స్వయంగా తీసి ఇచ్చి ఉత్సాహపరిచారు.
 

మరిన్ని వార్తలు