విధి నిర్వహణలో అలసత్వం తగదు

17 Jan, 2017 23:41 IST|Sakshi
విధి నిర్వహణలో అలసత్వం తగదు
బలవంతులు, బలహీనులంటూ రాజీలు చేయకండి 
– నేర సమీక్షా సమావేశంలో క్షేత్రస్థాయి అధికారులకు ఎస్పీ ఆదేశం
కర్నూలు: విధి నిర్వహణలో అలసత్వం వీడి నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ క్షేత్రస్థాయి పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలవంతులు, బలహీనులంటూ సమస్యలపై స్టేషన్లకు వచ్చిన బాధితులను రాజీ చేయకండని తెలిపారు. ఇటీవల కాలంలో సైబర్‌ నేరాలు ఎక్కువయ్యాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏటీఎం కార్డు నెంబర్‌ తెలుసుకుని ఘరానా మోసాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠినంగా వ్యవహరించాలన్నారు. దారి తప్పితే ఎంతటి వారైనా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లారీ దొంగతనాలపై నిఘా ఉంచాలన్నారు. శివరాత్రి బందోబస్తు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నేరం జరిగిన చోట కీలక ఆధారం ఏదో ఒకటి ఉంటుందని, వాటితో కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నారు. రౌడీయిజం, గూండాయిజం జిల్లాలో ఎక్కడ ఉన్నా పూర్తిగా అణచివేయాలన్నారు. గణేష్‌ నిమజ్జనం, బక్రీద్, పుష్కరాలు, వివిధ రకాల బందోబస్తుల్లో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు.
 
ఈ–బీట్స్‌ అమలుపై వర్క్‌షాప్‌
జిల్లా పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశపెట్టనున్న ఈ–బీట్స్‌ అమలుపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ–బీట్స్‌ను బలోపేతం చేసి నేరాలను తగ్గించాలని ఎస్పీ సిబ్బందికి సూచించారు. గస్తీలకు వెళ్లే పోలీసు సిబ్బంది విషయంలో సీఐలు, ఎస్‌ఐలు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ రవిప్రకాష్, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు డి.వి.రమణమూర్తి, బాబుప్రసాద్, ఎ.జి.కృష్ణమూర్తి, వెంకటాద్రి, హరినాథరెడ్డి, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, బాబా ఫకృద్దీన్, రామచంద్ర, హుసేన్‌ పీరాతో పాటు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు