వానాకాలం.. విష సర్పాలతో జాగ్రత్త !

12 Sep, 2017 07:29 IST|Sakshi
వానాకాలం.. విష సర్పాలతో జాగ్రత్త !

ఇది విష పురుగులు కాటేసే సమయం
వర్షాకాలంలో పొంచి ఉన్న ముప్పు
జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాలకు రక్షణ


రొళ్ల :
వర్షాకాలం ప్రారంభం కాగానే ఖాళీ స్థలాలు, నీటిమడుగుల వద్ద, గడ్డిమొక్కలు ఉన్న ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉంటాయి.. కుంటలు, పశువుల పాకలు, గుబురు ప్రదేశాలు, గడ్డి వాములు, పేర్చిన కట్టెలు, ఇతర ఖాళీ ప్రదేశాల్లో విష పురుగులు సంచరిస్తుంటాయి. రాత్రనకా పగలనకా పంట పొలాల్లో తిరిగే రైతన్నలు తరచుగా పాము కాటుకు గురవుతుంటారు. ఏ మాత్రం అజాగ్రత్త (ఏ మరపాటుగా) ఉన్నా అవి కాటేసే ప్రమాదం ఉంది..ముఖ్యంగా రైతులు,కూలీలు అటవీ ప్రాంతాల్లో తిరిగేవారు, పొలాల వద్ద నివాసం ఉంటున్నవారు..ఖాళీ ప్రదేశాలకు సమీపంలో ఉంటున్న వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యాధికారులు, వ్యవసాయాధికారులు చెప్తున్నారు.  

పాము కాటేసే సమయాలు ఇవే :
వర్షాకాలంలో ప్రధానంగా గ్రామీణప్రాంతాల్లో విషపురుగులు, పాములు అధికంగా సంచరిస్తుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి కాటు వేస్తాయి. వర్షాకాలంలో రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై, పాముకాటుకు గురయ్యే ప్రమాదాలు అనేకం ఉంటాయి. పాములు కూడా గుడ్లను పొదిగి పిల్లలను లేపే సమయం. కప్పలు కూడా బయటకు వచ్చే సమయం వర్షాకాలమే కావడంతో వాటిని వేటాడేందుకు పాములు సంచరిస్తుంటాయి. పొలం గట్టు, అటవీ ప్రాంతాల్లో, పొదల్లో  ఎక్కువగా తిరుగుతుంటాయి.

ఈ పాములు ప్రమాదకరం :
కట్లపాములు, రక్తపింజర, తాచుపాములు, నీటి పాములు, తేళ్లు, జెర్రెలు ప్రమాదకరం. వాటి కాటుకు గురైన బాధితులకు సరైన సమయంలో వైద్యం అందకపోతే ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. తాచుపాము, నాగుపాము, కట్లపాము కాటేస్తే వాటి విషం నేరుగా కేంద్ర నాడీ మండలం, ఊపిరితిత్తులపై పని చేస్తుంది. హృదయ స్పందన ఆగి అప్పటికప్పుడే మరణం సంభవిస్తుంది. రక్తపింజర విషం ఎక్కువగా రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. రక్తనాళాలు చిట్లి నోటి నుండి రక్తం వస్తుంది. రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్తం గడ్డకట్టడం వల్ల కాటుకు గురైన వ్యక్తి మరణిస్తాడు.

ఎలా గుర్తించాలి?
పాము కాటు శరీరంపైన పడిందా లేక బట్టల పైన పడిందా అన్న విషయాన్ని ముందుగా పరిశీలించాలి. శరీరం పైన కాటు వేస్తే ఎన్ని గాట్లు పడ్డాయో చూడాలి. తాచుపాము, కట్లపాము, రక్తపింజర కాటేస్తే రెండు గాట్లు పడతాయి. అంతకంటే ఎక్కువ గాట్లు కన్పిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు.

ఏం చేయాలి?
కాటు వేసిన శరీర భాగం నుంచి ఇతర భాగాలకు రక్తప్రసరణ జరగకుండా పై భాగాన రబ్బరు లేదా తాడు లేదా గుడ్డతో గట్టిగా కట్టాలి. దీనివల్ల విషం త్వరగా గుండెకు చేరకుండా నివారించవచ్చు. దీంతో పాటు పాము కాటుకు గురైన వ్యక్తి నడవడం, పరిగెత్తడం వంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకునేలా చూడాలి.  
పాము కరిచిన చోట పెద్దగా గాయం చేసి విషాన్ని నోటితో పీల్చి ఉమ్మేయడం కూడా మంచిది కాదు. దీనివల్ల గాయం మరింత పెద్దదై విషం చర్మంలోకి, చుట్టుపక్కల ఉన్న కణాల్లోకి వ్యాపించి త్వరతిగతిన గుండెకు చేరుతుంది.

జాగ్రత్తలు పడాల్సిన విషయాలు..
గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో తిరిగే వారు, అక్కడే నిద్రించే వారు వెంట లైటు(లాంతరు) ఉంచుకోవాలి. పాములు కిరోసిన్, పెట్రోలు వాసన భరించలేవు. ఎక్కువగా ఉన్నచోట వీటిని ఉపయోగిస్తే మంచిది. రైతులు,కూలీలు రాత్రి వేళల్లో తిరిగేటప్పుడు మోకాళ్ల వరకు రబ్బరు బూట్లు వేసుకోవడం, గడ్డి పని చేసే వారు చేతికి రబ్బరు తొడుగులు తొడుక్కోవడం మంచిది. నివాసాల చుట్టూ ముళ్ల పొదలు లేకుండా చూసుకోవాలి.

ప్రథమ చికిత్స ఇలా చేసుకోవాలి.. :
పాము కాటు వేసిన పైభాగంలో వెంటనే రక్త ప్రసరణ ఆడకుండా బిగించి తాడుతో కట్టి వేయాలి. కాటు వేసిన శరీర భాగాన బ్లేడుతో గాయం చేసి, రక్తం కారకుండా జాగ్రత్త పడాలి.
పాము కాటుకు గురైన వ్యక్తి ముందుగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పక్కన మరో వ్యక్తి ఉంటే బాధితుడికి ధైర్యం చెప్తూ ఉండాలి.
కాటు వేసిన పాము అంతకు ముందు ఆహారం తిన్నా.. మరో జీవిని కాటు వేసినా విషం తీవ్రత తక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది.
పాము కాటు వేసిన వ్యక్తికి ఆహారం ఇవ్వ కూడదు, నడిపించకూడదు.పరుగు పెట్టించరాదు.
నాటు మందు, మాత్రలు అని కాలయాపన చేయకుండా వెంటనే దగ్గరలోని వైద్యశాలకు తరలించాలి.
పాము కాటుకు గురైన వ్యక్తిని నిద్ర పోకుండా చూసుకొని, కదిలించకుండా ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

పాములు కాల్వగట్లు, పొదలు, గడ్డి వాములు, పొలం గట్లు, పశువుల పాకలు, పాడుబడిన ఇళ్లు, పెంట దిబ్బల్లో ఎక్కువగా విష పురుగులు సంచరిస్తుంటాయి.రాత్రి వేళల్లో ఆహారం కోసం బయటకు వచ్చి బల్లులు, ఎలుకలు, కప్పలు, తొండలను పట్టుకుని ఆరగిస్తాయి. ఇలాంటి ప్రాణులు ఎక్కుగా ఉన్న చోట పాములు కూడా ఎక్కువ శాతం తిష్టవేసి ఉంటాయి. పాములకు చెవులు లేనప్పటికీ వాటి శరీరం కింద భాగాన ఉండే ప్రత్యేక పొలుసుల ద్వారా శబ్ద ప్రకంపనలను గ్రహిస్తుంటాయి. వేడి రక్తం ప్రవహించే జంతువులు, మనుషులు సమీపంలోకి వచ్చినప్పుడు వెంటనే వాటిని గుర్తించి కాటు వేస్తాయి. పంట పొలాల్లో తిరిగే పాములు చాలా ప్రమాదకరమైనవి, విషపూరితమైనవి. పాములు ఏకాంతానికి భంగం కలిగినప్పుడు,ప్రాణ భయం ఉన్నప్పుడు,ఎవరైనా వాటిపై కాలు మోపినప్పుడు అవి వెంటనే కాటు వేసే ప్రమాదం ఉంది.

మరిన్ని వార్తలు