హై'రా'నా

6 Jun, 2016 03:18 IST|Sakshi
హై'రా'నా

ఇన్నాళ్లు గజరాజులతో కష్టాలు పడుతున్న పలమనేరు, కుప్పం ప్రాంత వాసులకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చిపడింది. కౌండిన్య అడవిలో ఇటీవల నుంచి హైనాల దాటికి పలు మేకలు, గొర్రె పిల్లలు దూడలు మృత్యువాత పడుతున్నాయి. అడవికి ఆనుకుని పశువులను, మేకలను తోలుకెళ్లే కాపరులు ఆందోళన చెందుతున్నారు. నెలరోజులుగా ఈ ప్రాంతంలో దాదాపు 40 దాకా మేకలు, గొర్రెలు, దూడలను హైనాలు పొట్టనబెట్టుకున్నాయి. అయితే ఇది పులి పనే అని స్థానికులు వాపోతున్నారు. కాదు పులిలాగా చారలు కలిగిన హైనా అనే జంతువని అటవీశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
 
* మాయమవుతున్న మేకలు, గొర్రెలు
* ఇది పులి పనేనని జనానికి గిలి
* హైనా పులిని పోలి ఉంటుందంటున్న అటవీశాఖ
* ఆందోళన చెందుతున్న పశువులు, మేకల కాపరులు

పలమనేరు రూరల్: పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో అటవీ సమీప ప్రాంతవాసులు హైనా(దొమ్మలగొండి)తో హైరానా పడుతున్నారు. మేకలు, గొర్రెలు, పశువులను మేతకు తోలుకెళ్లాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా పలమనేరు రేంజ్ పరిధిలోని నెల్లిపట్ల, బాపలనత్తం, వెగంవారిపల్లె, కడతట్లపల్లె, కుప్పనపల్లె, దేవదొడ్డి, కైగల్, కస్తూరినగరం, చింతమాకులపల్లె, పలమనేరు మండలంలోని కాలువపల్లె, మండీపేట కోటూరు, జగమర్ల తదితర అటవీ సమీప గ్రామాలకు చెందిన వారి జీవాలు అదృశ్యమవుతున్నాయి.

సాయంత్రం మందలను గమనిస్తేగానీ విషయం బయటపడడం లేదు. దీంతో కాపరులు అడవిలోకి వెళ్లి పరిశీలిస్తే పశువుల కళేబరాలు దర్శనమిస్తున్నాయి. హైనాల బారినుంచి తమ జీవాలను కాపాడాలని జనం కోరుతున్నారు. బెరైడ్డిపల్లె, వీకోట మండలాల్లో ఇప్పటివరకు వీటి బారిన పడి మృతి చెందిన మేకలు, దూడల మృతదేహాలను అటవీశాఖ పరిశీలించి ఇది హైనాల పనేనని తేల్చారు. ఎందుకంటే పులి అయితే జంతువు మాంసం కూడా తినేస్తుందని హైనాలు గొంతును కొరికి కేవలం రక్తం, మెత్తని భాగాలను మాత్రమే తింటాయని చెబుతున్నారు. ఇవి పులి కంటే కాస్త తక్కువ ఎత్తు కలిగి, చారలు కలిగి ఉంటాయని, దూరం నుంచి చూస్తే పులిలాగానే కనిపిస్తుందని అధికారులు తెలిపారు. ఎక్కడైతే ఏనుగుల సంచారం ఉంటుందో ఆ అడవుల్లో పులులు ఉండవని చెబుతున్నారు.
 
తమిళనాడు అడవుల నుంచి వచ్చినట్టున్నాయి
కౌండిన్య అడవిలో హైనాల కారణంగా పలు దూడలు, గొర్రెలు, మేకలు మృత్యువాతపడుతున్న విషయం వాస్తవమే. మేం కూడా అడవిలో ట్రాకర్స్ ద్వారా వాచ్ చేయిస్తున్నాం. ప్రజలు పులి అనుకుంటున్నారు ఇది ఒట్టిమాటే. అయితే ఇది చూసేందుకు పులిలాగా చారలు కలిగి ఉంటుంది. గతంలో ఇక్కడ హైనాల సంతతి తక్కువగానే ఉండేది. ప్రస్తుతం సంచరిస్తున్న పెద్ద హైనాలు తమిళనాడు అడవి నుంచి వచ్చాయి.     
- శివన్న, ఎఫ్‌ఆర్వో, పలమనేరు ఫారెస్ట్ రేంజ్
 
అడవిలోకి వెళ్లాలంటే భయమేస్తోంది
అడవికెళ్లిన పశువులు, దూడలు, మేకలు మాయమవుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలా లేదు. కొందరు మాత్రం పులి అయి ఉంటుందని చెబుతున్నారు. కానీ ఈ దెబ్బతో మేమంతా అడవిలోకి పశువులను కూడా తోలడం లేదు.
- బాబునాయుడు, ఊసరపెంట, పలమనేరు

మరిన్ని వార్తలు