దొంగతనాలపై అప్రమత్తంగా ఉండండి

20 May, 2017 00:16 IST|Sakshi
దొంగతనాలపై అప్రమత్తంగా ఉండండి
ఏలూరు అర్బన్‌  : వేసవిలో చల్లగాలి కోసం చాలామంది ప్రజలు ఇళ్ల బయట, డాబాల పైన పడుకునే సమయంలో ఇళ్లకు తాళాలు వేసుకోకుంటే దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ హెచ్చరించారు. శుక్రవారం ‘డయల్‌ యువర్‌ ఎస్పీ’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎస్పీ ప్రజలతో నేరుగా ఫోన్‌ లో మాట్లాడారు. సమస్యలు విని సంబంధిత అధికారులకు ప్రజల ఫిర్యాదులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలంలో ఇళ్ల దొంగతనాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. వాటిని నిరోధించేందుకు పోలీస్‌ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. అయితే దొంగతనాలు అడ్డుకునేందుకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. దానిలో భాగంగా ఇళ్ల బయట, డాబాల పైన పడుకునే సమయంలో తలుపులకు తాళాలు వేసుకోవడంతో పాటు సాధ్యమైనంత వరకూ ఇళ్లలో విలువైన నగలు, పెద్దమొత్తంలో నగదు ఉంచుకోవద్దని సూచించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులంతా ఇళ్లకు తాళాలు వేసుకుని పొరుగూరు వెళ్లే క్రమంలో సదరు విషయాన్ని సంబంధిత పోలీస్‌స్టేషన్‌ లో తెలిపితే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 28 మంది ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అందులో కొన్ని ఇలా ఉన్నాయి. తణుకు నుంచి ఫోన్‌  చేసిన వ్యక్తి పట్టణంలో క్రికెట్‌ బెట్టింగ్, బైక్‌ రేసింగ్‌లు జరుగుతున్నాయని నిరోధించాలని కోరాడు. ఏలూరు నుంచి ఫోన్‌  చేసిన వ్యక్తి తంగెళ్లమూడి ఎలక్ట్రికల్‌ సబ్‌స్టేషన్‌  వద్ద ఆకతాయిల ఆగడాలను నిరోధించాలని ఫిర్యాదు చేశాడు. చింతలపూడి నుంచి ఫోన్‌  చేసిన వ్యక్తి పట్టణంలో కోడి పందేలు, పేకాటలు పెద్దఎత్తున జరుగుతున్నాయని, వాటిని పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.  
 
మరిన్ని వార్తలు