ఎమ్మెల్యే దంపతుల్ని పొగడడమే యాంకరింగ్..

10 Jan, 2016 02:48 IST|Sakshi
ఎమ్మెల్యే దంపతుల్ని పొగడడమే యాంకరింగ్..

 సాక్షి ప్రతినిధి, కాకినాడ: బీచ్ ఫెస్టివల్.. కాకినాడ సాగర ఉత్సవాలు.. వీటికి ఎన్‌టీఆర్ బీచ్ ఫెస్టివల్‌గా ప్రభుత్వం నామకరణం చేసింది. నిర్వహణకు దాదాపు రూ.కోటి ఖర్చు చేసింది. ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమమైనా స్థానికంగా ఉన్న వివిధ పరిశ్రమల యాజమాన్యాలు లక్షల రూపాయల విరాళం ప్రకటించాయి. స్టాల్స్ అద్దెలు, ఇతరత్రా కొంత రాబడి వచ్చింది.కానీ ఈ కార్యక్రమం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల స్వోత్కర్ష, వారి పిల్లలు, బంధుమిత్రుల హంగామాకు వేదికగా మారింది. ఇక ఈ మూడు రోజులూ మంచి వ్యాపారం జరుగుతుందని భారీ అద్దె చెల్లించి స్టాల్ తీసుకున్న నిర్వాహకులు మాత్రం బెంగ పడుతున్నారు. కేవలం ఆదివారం ఒక్కరోజుపైనే లాభమా, నష్టమా అనేది ఆధారపడి ఉంది.
 
 పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఏటా బీచ్ ఫెస్టివల్‌ను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వమే అన్నీ చేతుల్లోకి తీసుకోవడంతో పర్యాటక శాఖ పాత్ర నామమాత్రమవుతోంది. ఈసారి బీచ్ ఫెస్టివల్‌ను రాష్ట్ర పండగగా ప్రకటించిన ప్రభుత్వం.. నిర్వహణకు రూ.కోటి కేటాయించింది. ఈ ఫెస్టివల్‌లో సాంస్కృతిక కార్యక్రమాలకు మూడు వేదికలను నిర్మించారు. ప్రధాన వేదికపై సంగీత విభావరి, మిమిక్రీ తదితర వినోద కార్యక్రమాల నిర్వహణను హైదరాబాద్‌కు చెందిన ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు అప్పగించారు. మూడ్రోజుల కార్యక్రమాల నిర్వహణకు రూ.95 లక్షల కాంట్రాక్టును ఆ సంస్థకు ఇచ్చినట్లు సమాచారం.
 
 ఆ సంస్థ నిర్వాహకులతో జిల్లాకు చెందిన ఎంపీ కుమారుడికి సన్నిహిత సంబంధాలున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతచేసినా ఆ ప్రధాన వేదికపై స్థానిక కళలకు, కళాకారులకు స్థానం లభించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ప్రధాన వేదిక వద్ద సందర్శకులకు ఇబ్బందికర పరిస్థితే ఏర్పడుతోంది. వేదిక ముందు మూడు వరుసల్లో బారికేడ్లు వేశారు. అక్కడి సీట్లన్నీ వీఐపీలకు కేటాయించారు. ఆ పాస్‌లలో ఎక్కువ స్థానిక ఎమ్మెల్యే కుటుంబసభ్యుల చేతుల్లోకే వెళ్లాయి.  బారికేడ్ల అవతల నుంచి వేదికపై కార్యక్రమాలు చూడటానికి వీలుగాకపోవడంతో చుట్టూ ఉన్న వారు బారికేడ్‌పై పడిపోతున్నారు. తీరా వీఐపీల గ్యాలరీ తొ లిరోజు నిండుగా కనిపించినా మలిరోజు వెలవెలపోయింది.
 
 ప్రభుత్వం నిర్వహిస్తున్న బీచ్‌ఫెస్టివల్ పూర్తిగా నేతలకు పొగడ్తల కార్యక్రమంలా తయారైంది. తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఓ ఎమ్మెల్యే దంపతులపై యాంకరు పొగడ్తల వర్షం కురిపించడం గమనార్హం. కార్యక్రమాల గురించి సందర్శకులకు చక్కగా వివరిస్తూ ఆహ్లాదం పంచాల్సింది పోయి ఇదేమి చోద్యమని సందర్శకులు విస్తుపోయూరు. నిరుటి బీచ్ ఫెస్టివల్‌లో ప్రధాన వేదికపై అధికార పార్టీ నాయకుల తనయులు కొందరు డ్యాన్సులతో హల్‌చల్ సృష్టించడం విమర్శలకు దారి తీసింది. కనీసం ఆదివారం ముగింపు కార్యక్రమంలోనైనా అలాంటివి జరక్కుండా అధికారులు చూడాలని ప్రజలు కోరుతున్నారు.
 
 ఫుడ్‌స్టాల్స్ నిర్వాహకుల ఆవేదన..
 ఈ ఫెస్టివల్ రాజకీయ నాయకులకు పండగ వాతావరణం తీసుకొచ్చినా మూడు రోజులకు రూ.10 వేలు చెల్లించి స్టాల్ తీసుకున్న వ్యాపారులకు నిరుత్సాహాన్నే మిగిల్చింది. కారణం.. బీచ్‌లో ఈ స్టాల్స్ అన్నీ ప్రధాన వేదికకు సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఏర్పాటు చేశారు. వాటిలో కూడా అధికార పార్టీ ముఖ్య నేతకు చెందిన సంస్థ స్టాళ్లకు తొలి వరుసలోనే కేటాయింపు లభించింది. ఇక చివరి వరుసలో ఉన్న స్టాళ్ల వద్ద సందర్శకులే కరువయ్యారు.
 
 తొలిరోజు సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు చేసిన ఓవరాక్షన్ ఫలితంగా వ్యాపారం ఏమీ జరగలేదని స్టాల్స్ నిర్వాహకులు పెదవి విరుస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి సీఎం రాత్రి 10 గంటలకు వెనుదిరిగే వరకూ ఆంక్షలు విధించారు. ఇక ప్రధాన ద్వారం ఎదురుగా ఏర్పాటు చేసిన నమూనా ఆలయాలను సందర్శించినవారు నేరుగా ప్రధాన వేదికవైపు వెళ్లిపోతుండగా స్టాల్స్ వైపు వస్తున్నవారి సంఖ్య తక్కువగా ఉంటోంది. కనీసం ఆదివారమైనా పోలీసులు సహకరిస్తే సందర్శకుల రాక పెరిగి వ్యా పారం జరుగుతుందని స్టాల్స్ నిర్వాహకులు ఆశిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు