-
‘బీచ్‌లవ్’ ప్రతిపాదనపై కవుల నిరసనగళం
రాజమహేంద్రవరం కల్చరల్ :
ప్రభుత్వం తలపెట్టిన ’బీచ్ లవ్’ భారతీయ సంస్కృతికి వ్యతిరేకం, ఆంధ్ర సంస్కృతికి అవమానమని కళాగౌతమి అనుబంధ సంస్ధ రచయితల సమితి ఏకగ్రీవ తీర్మానంతో నిరసించింది. ఆదివారం దానవాయిపేట గ్రంథాలయం మేడపై జరిగి న సమితి సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ బి. వి.ఎస్.మూర్తి మాట్లాడుతూ విదేశీయులు మన దేశానికి చేయలేని కీడును నేడు గద్దెనెక్కిన పెద్దలు చేస్తున్నారని నిరసించారు. ‘జరుగవలెను ప్రేమలు చాటుగానె–బట్టబయలు చేయుట భావ్యమగునె– వెర్రి వేషాలు వేయంగ వెసలుబాటు–ఆటవస్తువయ్యె అబల బ్రతుకం త’ అన్న స్వీయరచనను వినిపించారు. విజయకుమార్ యాళ్ళ రచించిన ‘విజయరవళి‘ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
బుద్ధినీ విదేశాలకు అమ్ముకుంటున్నాం..
కవులు బీచ్ లవ్‌పై తమ నిరసనకు ఇలా వ్యక్తం చేశారు.. ‘మద్యం మత్తులో మీరు–సాగర సౌందర్యాన్ని తొక్కేస్తున్నారు–వెకిలి పాటల మధ్య–సాగరఘోష మీకు వినిపించదు–నకిలీ దీపకాంతుల్లో నిండు చంద్రుని చూడలేరు (రామచంద్రుని మౌనిక)’, ‘భూమిని అమ్ముకుంటున్నాం–నీటిని అమ్ముకుంటున్నాం–అగ్నిని అమ్ముకుంటున్నాం–బుద్ధిని విదేశాలకు అమ్ముకుంటున్నాం (బహుభాషావేత్త మహీధర రామశాస్త్రి)’, ’సాగర తీరతిన్నెలపై–చట్టబద్ధతను కూర్చి–విశృంఖల సంస్కృతికై ’పచ్చ’కామెర్ల మాయాజూదం (తాతపూడి అబ్రహాం ప్రభాకర్)’ అంటూ బీచ్‌లవ్ ప్రతిపాదనను నిరసించారు.