మూసీ బుగ్గపై బ్యూటీ స్పాట్‌

3 Mar, 2017 22:48 IST|Sakshi
మూసీ బుగ్గపై బ్యూటీ స్పాట్‌

సాక్షి, సిటీబ్యూరో: మూసీ నది ఈ పేరు వినగానే కంపు కొట్టే వాసనే గుర్తుకొస్తుంది. ఈ ఇబ్బందికర వాతావరణాన్ని మార్చేందుకు  నాగోల్‌ బ్రిడ్జ్‌ నుంచి ఉప్పల్‌ భగాయత్‌ లే అవుట్‌ డౌన్  బ్రిడ్జ్‌ వరకు సుందరీకరణ పనులు చేపట్టారు. ఏకో ఫ్రెండ్లీ వాతావరణం తలపించేలా పాత్‌వేస్, షోర్‌లైన్  ఇంప్రూవ్‌మెంట్, ల్యాండ్‌స్కేప్‌ పనులు ఆ ప్రాంతంలో శరవేగంగా సాగుతున్నాయి. హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్‌ విభాగంతో పాటు అర్బన్  ఫారెస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ అధికారులు సంయుక్తంగా ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే అన్ని పనులు పూర్తవుతాయని చెబుతున్నారు.

నది పక్కనే వాకింగ్‌ ట్రాక్‌లు
మూసీ నది అనగానే వామ్మో అక్కడికెళ్లాలా అని ఉలిక్కిపడే నగరవాసులను అక్కడికి రప్పించేలా విలేజ్‌ కల్చర్‌ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. నగరంలోని ఒక పార్కు వెళితే కనిపించే దృశ్యాలన్నీ ఇక్కడ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బఫర్‌జోన్ గా పిలిచే ఈ రెండు కిలోమీటర్ల ప్రాంతంలో 100 ఫీట్ల రోడ్డును వేశారు.

పార్కుల్లో సందర్శకులు నడిచేందుకు వాకింగ్‌ ట్రాక్‌లను కూడా నిర్మించారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర నడిచేలా అన్ని సౌకర్యాలను కల్పించారు. మధ్యలో సేదతీరేందుకు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన బెంచ్‌ల మాదిరిగానే ఇక్కడా బెంచ్‌లు తెప్పిస్తున్నారు. రోడ్డువైపున గ్రిల్స్‌ బిగించారు. దాదాపు 1.5 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న రాతి విగ్రహాలు, లోహ విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

దోమలకు చెక్‌ పెట్టే మొక్కలు..
మూసీ నది ఒడ్డుకు వెళితే దోమలు వెంటబడి తరుముతాయి. దుర్వాసనకు అడుగు పడదు. ఆరోగ్య ఇబ్బందులు ఎదురవుతాయి. ఇకపై ఇటువంటి మాటలకు తావుండదు. హెచ్‌ఎండీఏ అధికారులు సువాసన వెదజల్లే మొక్కలు నాటుతున్నారు. తాగునీటి సౌకర్యం కోసం నల్లాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దోమల నివారణకు మెడిసినల్‌ ప్లాంట్‌లు నాటుతున్నారు.

నక్షత్రవనం, తులసి మొక్కలు, వివిధ రకాల పూల మొక్కలు, లెమన్  గ్రాస్, లావెండర్, వాము తదితర మొక్కలను వరుస క్రమంలో పెడుతున్నారు. పాదచారులు మధ్యమధ్యలో సేదతీరేందుకు నీడనిచ్చే మొక్కలను కూడా నాటారు. ఇలా దాదాపు ఐదు లక్షల వరకు మొక్కలు నాటుతున్నట్టు అర్బన్  ఫారెస్ట్రీ డైరెక్టర్‌ కె.సత్యనారాయణ తెలిపారు. పైలట్‌ ప్రాజెక్టుగా తలపెట్టిన ఈ బ్యూటిఫికేషన్  పనులకు దాదాపు రూ.ఐదు కోట్ల వరకు వ్యయం చేస్తున్నారు. తొమ్మిది నెలల క్రితం ప్రారంభమైన ఈ పనులు మరో నెలరోజుల్లో పూర్తవుతాయని అధికారులు  చెబుతున్నారు.

మరిన్ని వార్తలు