భక్తుల చేత శభాష్‌ అనిపించుకుందాం

7 Aug, 2016 23:17 IST|Sakshi
భక్తుల చేత శభాష్‌ అనిపించుకుందాం
– మెరుగైన సౌకర్యాలు కల్పించండి  
– 24గంటలు కలెక్టర్, ఎస్పీలు అందుబాటులో....
– పుష్కర విధులు నిర్వహించడం మహాపుణ్యకార్యం
– డిప్యూటీ సీఎం కేఈ కష్ణమూర్తి
 
 
శ్రీశైలం:
 భక్తుల చేత శభాష్‌ అనిపించుకునేలా శ్రీశైల మహాక్షేత్రంలో కృష్ణా పుష్కరాలను అధికారులు విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి అన్నారు. శనివారం రాత్రి శ్రీశైలం చేరుకున్న ఆయన ఆదివారం ఉదయం స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం పుష్కరఘాట్లను సందర్శించారు. జిల్లా కలెక్టర్‌ విజయమోహన్, డీఐజీ రమణకుమార్, ఎస్పీ రవికృష్ణ, ఈఓ భరత్‌గుప్త, జెఈఓ హరినాథ్‌రెడ్డి తదితరులతో కలిసి  పాతాళగంగ ఘాట్లను పరిశీలించారు. అనంతరం చంద్రావతి కల్యాణ మండపంలో పుష్కర విధులపై వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుని పుష్కరాల ఆరంభానికి శుభసూచకంగా కృష్ణమ్మ సంకేతాన్ని పంపిందని అన్నారు. ప్రత్యేక విధులపై హాజరైన ప్రతి ఒక్కఅధికారి తమకు కేటాయించిన విధులను సక్రమంగా అమలు పరిచి అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. గత కొన్ని వారాలుగా జిల్లా కలెక్టర్‌ పుష్కరాల  విధుల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా పని చేయాలి, అనే విషయాలను విశదీకరించి ఉంటారని అన్నారు. అలాగే డీఐజీ, ఎస్పీలు భద్రతాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియజెప్పి ఉంటారని  ఈవిధి నిర్వహణలో ఉన్న వారంతా తప్పనిసరిగా ఆ నిబంధనలు పాటించి పుష్కరాలను విజయవంతం చేయాలన్నారు. ఆదివారం నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీలు శ్రీశైలాన్ని కేంద్ర కార్యాలయంగా చేసుకుని విధులు నిర్వహిస్తారని చెప్పారు. కృష్ణా జలాలు రావడంతో పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఎస్‌ఆర్‌బీసీలకు నీటిని వదిలే అవకాశం కలిగిందని ఇది కూడా శుభపరిణామంగా పేర్కొన్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే కృష్ణా నదీ పుష్కరాలలో ఈ ఏడాది శ్రీశైలం, సంగమేశ్వరంలలో విధులు నిర్వహించే ప్రభుత్వ సిబ్బంది  భక్తులకు తమ సేవలను అందించడం ద్వారా ఎంతో పుణ్యం చేసుకున్నారని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని  పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు.    
 

 

మరిన్ని వార్తలు