బీరాల బీమా !

17 Mar, 2017 01:33 IST|Sakshi
ఏలూరు (మెట్రో) : ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన చంద్రన్న బీమా పథకం జిల్లాలో బీరాల బీమాగా మారింది. ఆచరణలో చతికిల పడింది. లబ్ధిదారుల ప్రీమియం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో జమ కాకపోవడంతో 94,620 మంది బీమాకు దూరమయ్యే దుస్థితి నెలకొంది.  ఈ పథకంలో ప్రీమియం మొత్తంలో రూ.270 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. లబ్ధిదారులు కేవలం రూ.15 చెల్లిస్తే సరిపోతుంది. అయితే అధికారుల అశ్రద్ధ, లబ్ధిదారులకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వల్ల  94వేల 620 మంది చెల్లించాల్సిన బీమా ప్రీమియం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు జమ కాలేదు.   
నమోదు ఘనం 
జిల్లా వ్యాప్తంగా తొలుత చంద్రన్న బీమా పథకానికి 14లక్షల 21వేల 322 మంది పేర్లను నమోదు చేసినట్టు అధికారులు ఘనంగా ప్రకటించారు. వీరంతా తమ వాటా ప్రీమియం రూ.15 చొప్పున చెల్లిస్తే  రూ.2 కోట్ల 13లక్షల 19వేల 830 గ్రామీణాభివృద్ధి సంస్థకు  జమ కావాలి. కానీ రూ. కోటి 99లక్షల 527 మాత్రమే జమ అయిందని అధికారులు చెబుతున్నారు. అంటే ఇంకా 14లక్షల 19వేల 303 రావాల్సి ఉంది. ఈలెక్కన 94వేల 620 మంది నుంచి ప్రీమియం రాలేదన్నమాట.  
ప్రీమియం కట్టారా.. మాయమయ్యాయా!
ప్రీమియం జమ కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి స్మార్ట్‌పల్స్‌ సర్వే చేసిన సమయంలోనే ప్రీమియం మొత్తాలను  లబ్ధిదారుల వద్ద నుంచి సర్వే సిబ్బంది వసూలు చేశారు. ఇప్పటివరకూ జమైన ప్రీమియం సొమ్ములు కూడా ఇలా వచ్చినవే. అయితే ఎప్పుడో వసూలు చేసిన ఈ డబ్బులు ఇంకా జమకాకపోవడం, అధికారికంగా లబ్ధిదారులకు బీమా పత్రాలు అందిచకపోవడం చూస్తుంటే నిజంగా వారి వద్ద నుంచి వసూలు కాలేదా, లేక వసూలు అయినా జమకాలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రీమియం సొమ్మును సర్వే సిబ్బందికి అప్పగించడం, దీనిని పర్యవేక్షించే నాథుడు లేకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. 
30 వరకే గడువు 
ఈ పథకానికి బీమా ప్రీమియం చెల్లించే గడువు ఈ నెల 30 లోగా పూర్తికానుంది. దీంతో 94వేల మంది ప్రీమియం సొమ్ములు జమ కాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 30లోగా అవి జమ కాకపోతే వారంతా బీమాకు దూరమయ్యే పరిస్థితి.  
ఉపయోగాలివీ.. 
చంద్రన్న బీమా పథకం ప్రకారం.. బీమాదారులు సహజంగా మరణిస్తే రూ.15వేలు, ప్రమాదవశాత్తూ మరణించినా, శాస్వత వైకల్యం పొందినా  రూ.5లక్షలు, పాక్షిక వైకల్యం కలిగితే రూ.3.6లక్షలు ఆ వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం చెల్లిస్తుంది. బీమాదారుల  పిల్లలకు ఏడాదికి రూ.1200 ఉపకార వేతనంగా తొమ్మిదోతరగతి నుంచి ఇంటరీ్మడియెట్‌ వరకూ చెల్లించనున్నారు.
క్లెయిమ్‌ల పరిష్కారం ఇలా.. 
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 2వేల 438 మంది వివిధ ప్రమాదాల వల్ల బీమా పరిష్కారానికి క్లెయిమ్‌చేశారు.  వారిలో 2వేల 122 మందికి క్లెయిమ్‌లు పరిష్కారమయ్యాయి.  ఇంకా 316 మంది క్లెయిమ్‌లు పరిష్కారం కావాల్సి ఉంది.
 
రూ.50 కోట్లు చాలదు
ఆయిల్‌పామ్‌ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.50కోట్లు సరిపోవు. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్‌పామ్‌ తోటలు ఉన్నాయి. టన్నుకు కనీసం రూ.9వేల పైబడి ధర వస్తేనే గిట్టుబాటవుతుంది.  ఎరువులపై సబ్సిడీ పెంచాలి.  గెలల ధరను స్థిరీకరించాలి.
– గడ్డమణుగు సత్యనారాయణ, ఆయిల్‌పామ్‌ రైతు
 
>
మరిన్ని వార్తలు