అదృష్టమంటే ఈ అనంతపురం యాచకుడిదే!

2 Apr, 2016 06:50 IST|Sakshi
రూ.65 లక్షల లాటరీ టికెట్ తో పొన్నయ్య

'చక్రవర్తికి, వీధి బిచ్చగాడికి బంధువు అవుతానని అందీ మనీ మనీ..' అని మనీ కోసం మనిషి పడే పాట్లను వివరిస్తూ రాశాడో సినీకవి. మనీ చుట్టూ మనుషులు, మనుషుల మధ్య మనీ గాఢంగా పెనవేసుకుపోయిన ఈ కాలంలో అప్పనంగా డబ్బు సంపాదించడం తేలిక కాకపోయినప్పటికీ అదృష్టం తోడుంటే అదికూడా సాధ్యమే అనిపిస్తుంది. అనంతపురం జిల్లాకు చెందిన పొన్నయ్యది అలాంటి అదృష్టమే. బతకడం కోసం బెగ్గర్(యాచకుడి)గా మారిన అతనికి భారీ మొత్తం లాటరీలో బహుమతిగా దక్కింది. అది కూడా కేరళలో!

పొన్నయ్య ప్రస్తుత నివాసం కేరళ, తమిళనాడు సరిహద్దుల్లోని వెల్లరాడ ప్రాంతంలో ఉంటున్నాడు. ఒక కాలు లేని అతను బిచ్చమెత్తుకుని బతుకీడుస్తున్నాడు. కూడబెట్టిన సొమ్ములో కొంత అనంతపురంలో ఉంటోన్న భార్యకు పంపుతాడు. మిగిలిన దానితో లాటరీ టికెట్లు కొంటాడు.  రెండు రోజుల కిందట పోలీసులు వచ్చి పొన్నయ్యను స్టేషన్ కు తీసుకెళ్లారు. పోలీసులతోపాటే వచ్చిన ఓ వ్యక్తి స్టేషన్ కు వెళ్లిన తర్వాత అసలు విషయం చెప్పాడు. 'పొన్నయ్య.. నీకు లాటరీలో రూ.65 లక్షల బహుమతి వచ్చింది' అని. ఆ వ్యక్తి.. పొన్నయ్యకు లాటరీ టికెట్ అమ్మినాయన! కేరళలో ప్రభుత్వ అనుమతితో లాటరీలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సందర్భంలో పోలీసుల ప్రమేయం ఉంటుంది కాబట్టి బహుమతి వచ్చినవాళ్లను బురిడీ కొట్టించడం అంత తేలికకాదు.

అమౌంట్ కాస్త ఎక్కువ కాబట్టి పొన్నయ్య వాళ్లింటికి కబురు పెట్టారు పోలీసులు. పొన్నయ్య వాళ్ల నాన్న, అన్నయ్యలు నిన్నే అనంతపురం నుంచి కేరళకు వెళ్లారు. పొన్నయ్య అంగీకారంతో సదరు డబ్బును వాళ్లకు ఇచ్చేశారు పోలీసలు. ఈ డబ్బులతో తన పిల్లల చదువులు, ఇల్లాలి కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తున్నాడు పొన్నయ్య. మొదట్లో భవన నిర్మాణ కూలీ అయిన పొన్నయ్య పని ప్రదేశంలో కిందపడి కాలు పోగొట్టుకున్నాడు. అప్పట్నుంచి పనికి వెళ్లలేకి బిక్షగాడిగా మారి ఇంటిని నెట్టుకొస్తున్నాడు. ఏపీలో బతుకు మరీ భారంగా మారడంతో కేరళకు వలస వెళ్లి అక్కడా వృత్తిని కొనసాగించాడు. ఇంత డబ్బొచ్చింది కదా, ఇక హ్యాపీగా ఇంటికి వెళతాడేమో అనుకుంటే.. 'అలా కాదు, అక్కడే ఉండి అదే వృత్తిని కొనసాగిస్తా'అని చెబుతున్నాడు పొన్నయ్య!

మరిన్ని వార్తలు