బెల్లంపూడి టు బూటాన్‌..

25 May, 2017 00:31 IST|Sakshi
  • అంతర్జాతీయ బాక్సింగ్‌ పోటీలకు ఎంపికైన ‘హాసిని’
  • పి.గన్నవరం :
    మండలంలోని మారుమూల గ్రామమైన బెల్లంపూడిలో నిరుపేద కుటుంబానికి చెందిన చీకరమెల్లి హాసిని అనే ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని బూటాన్‌ దేశంలో జరిగే అంతర్జాతీయ బాలికల బాక్సింగ్‌ పోటీలకు ఎంపికైంది. ఈనెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న రూరల్‌ సౌత్‌ ఏషియన్‌ బాక్సింగ్‌ పోటీల్లో అండర్‌ 17 కేటగిరీ 64 కిలోల విభాగంలో భారతదేశం తరఫున తలపడనుంది. భారతదేశం నుంచి మొత్తం 12 మంది బాలికలు బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక కాగా, మన రాష్ట్రం నుంచి హాసినికి మాత్రమే స్థానం దక్కడం విశేషం. ఈనెల 19, 20, 21 తేదీల్లో హర్యానాలో జరిగిన జాతీయ బాక్సింగ్‌ పోటీల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించడంతో హాసినిని అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు గాను హాసిని బుధవారం రాత్రి బూటాన్‌ బయల్దేరింది. ప్రస్తుతం ఆమె నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తన తల్లిదండ్రులు వసంత కుమారి, కృష్ణారావు, జాతీయ బాక్సింగ్‌ రిఫరీ అయిన కోచ్‌ చిట్టూరి చంద్రశేఖర్‌ ప్రోత్సాహంతో తాను ఈ పోటీలకు ఎంపికైనట్టు వివరించింది. రూరల్‌ సౌత్‌ ఏషియన్‌ బాక్సింగ్‌ పోటీల్లో గోల్డు మెడల్‌ సాధించడమే తన లక్ష్యమని హాసిని పేర్కొంది.
    పతకాల పంటే..
    ఇంతవరకూ పాల్గొన్న ప్రతీ పోటీలో హాసిని సత్తా చాటింది. 2014లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో కాంస్య పతకాన్ని, 2015లో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌లో కాంస్య పతకం, రాష్ట్ర రూరల్‌ గేమ్స్‌లో బంగారు పతకం, 2016లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో వెండి పతకం, ఈ ఏడాది విశాఖలో జరిగిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీల్లో బంగారు పతకాలను సాధించింది.
     
    డబ్బులు లేక చివరి వరకూ ఇబ్బంది పడ్డ హాసిని
    అంతర్జాతీయ బాక్సింగ్‌ పోటీలకు ఎంపికైన హాసిని ఇతర ఖర్చులకు సైతం డబ్బులు లేక ఇబ్బంది పడింది. విషయం తెలుసుకున్న కొందరు దాతలు సాయం అందించి ఆమెను ప్రోత్సాహించారు. పై ఖర్చుల నిమిత్తం సుమారు రూ.30 వేలు అవసరం కాగా, దాతలు కొంత సొమ్ము సమకూర్చారు. దీంతో బుధవారం రాత్రి బెల్లంపూడి నుంచి ఆమె బూటన్‌కు బయలుదేరింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల్లో ఉన్న ఇటువంటి ఆణిముత్యాలను ప్రభుత్వంతో పాటు, దాతలు ప్రోత్సాహించాల్సిన అవసరం ఎంతైనాఉంది. 
     
మరిన్ని వార్తలు