‘ఈ రాఖీ పండుగకు అన్న వస్తే బాగుండు..!’

13 Aug, 2016 20:06 IST|Sakshi
‘ఈ రాఖీ పండుగకు అన్న వస్తే బాగుండు..!’

తుర్కపల్లి: 17 సంవత్సరాలుగా మా నలుగురం అక్కాచెల్లెళ్లం, మా అన్నయ్య అందరమూ విడిపోయాం. నయీం చనిపోయాడని తెలిసి ప్రస్తుతం ముగ్గురం అక్కాచెల్లెళ్లం కలుసుకున్నాం.. ఇంతవరకూ మా అన్నయ్య జాడ తెలియదు. ఈ రాఖీ పండుగకైనా మా అన్నయ్య వస్తే బాగుండు మేమంతా కలుసుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం అని బెల్లి లలిత సోదరీమణులు చెప్పారు. వివరాలు.. వారి మాటల్లోనే..‘‘ మేము నలుగురం ఆడపిల్లలం, ఒక అన్నయ్య. ఒగ్గుకథలు చెప్పి కుటుంబాన్ని పోషించేవాడు మా నాన్న. మా చిన్నతనంలో నాన్న చనిపోవడంతో అన్న బెల్లి క్రిష్ణ మా ఆలనా పాలనా చూస్తూ మా పెళ్లిళ్లు కూడా చేశాడు. తెలంగాణ సాధన కోసం కాలుకు గజ్జెకట్టి ఎన్నో వేదికల మీద తన ఆట పాటలతో జనాన్ని ఉర్రూతలూగించింది లలిత.

భువనగిరి నియోజకవర్గంలో రాజకీయంగా ఎదుగుతుందన్న కారణంతో కొంతమంది నాయకులు కక్షగట్టి 1999లో లలితను హత్య చేయించారు. అదే సంవత్సరం బెల్లి లలిత చెల్లెలు సరిత భర్త కరుణాకర్‌ను భువనగిరిలో హత్య చేశారు. ఆ తరువాత మా బెల్లి లలిత అక్క బాలక్రిష్టమ్మ భర్తను కూడా హత్య చేశారు. అలా ముగ్గురి హత్యలు జరిగిన తరువాత మా కుటుంబం చిన్నాభిన్నమైంది.. తెలంగాణ కోసం పోరాటం చేసిన బెల్లి లలిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుతున్నాం’’ అని బెల్లి లలిత సోదరీమణులు తెలిపారు.

మరిన్ని వార్తలు