‘బెల్ట్‌’ తీసే వారేరి?

10 Mar, 2017 01:40 IST|Sakshi
‘బెల్ట్‌’ తీసే వారేరి?

విచ్చలవిడిగా బెల్ట్‌ షాపుల నిర్వహణ
ఏరులై పారుతోన్న మద్యం  


బాల్కొండ: గ్రామాల్లో బెల్ట్‌ షాపుల నిర్వహణ జోరుగా సాగుతోంది. పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది! ఎక్సైజ్‌ అధికారులు ‘మామూలు’గా తీసుకోవడం, వీడీసీలు సైతం మద్దతు పలుకుతుండడంతో బెల్ట్‌ షాపుల దందా దర్జాగా నడుస్తోంది. ముప్కాల్, మెండోరా తదితర మండలాల పరిధిలో బెల్ట్‌షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ప్రతి గ్రామంలో షాపులు ఏర్పాటు చేసి, అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు. ముప్కాల్‌ మండలంలో ముప్కాల్‌తో పాటు రెంజర్లలో,  అలాగే, మెండోరా మండలంలో మెండోరాతో పాటు దూదిగాంలో ఎన్‌హెచ్‌ 44కు సమీపంలో వైన్‌ షాపులు ఉన్నాయి. మిగతా అన్ని గ్రామాల్లో బెల్ట్‌ షాపులు వెలిశాయి. ఒక్క శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ కాలనీలోనే నాలుగు బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈ అక్రమ దందా కొనసాగుతుందో ఊహించుకోవచ్చు. ఎక్సైజ్‌ అధికారులను, పోలీసులను మచ్చిక చేసుకుంటున్న నిర్వాహకులు.. గ్రామాభివృద్ధి కమిటీల సహకారంతో జోరుగా మద్యం విక్రయిస్తున్నారు. ఇందుకోసం ప్రతి నెలా వీడీసీలకు, అధికారులకు ఎంతో కొంత ముట్టచెబుతున్నారు.

ఎమ్మార్పీ కంటే ఎక్కువే
బెల్ట్‌ షాపులను నియంత్రించాల్సిన అధికారులతో పాటు వీడీసీలు సైతం కిమ్మనక పోవడంతో నిర్వాహకులు రెచ్చి పోతున్నారు. కొంత మంది బెల్ట్‌ షాపులనే వృత్తిగా మలుచుకున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ మందుబాబుల జేబు లు గుల్ల చేస్తున్నారు. ఒక్కో బీరుకు రూ.10, క్వార్టర్‌పై రూ.10–15 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రతి నెలా ఆదాయం వస్తుండడంతో వీడీసీలు ఈ అక్రమ దందాను చూసీ చూడనట్లు వదిలేస్తున్నాయి. మరోవైపు, ‘బెల్ట్‌’ తీయాల్సిన ఎక్సైజ్, పోలీస్‌ అధికారులు ‘మామూలు’గానే ‘మత్తు’లో తూగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బెల్ట్‌షాపులను నియంత్రించాలని పలు గ్రామాల వాసులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు