‘బెల్టు’ ఎలా.. తెగుద్ధి

19 Jul, 2017 23:12 IST|Sakshi
‘బెల్టు’ ఎలా.. తెగుద్ధి
- బెల్లు బిగించిందీ వారే ... 
- ‘బెల్టు’ తీయడం సాధ్యమేనా..?
– పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్టు షాపులు 
– మద్యం దుకాణదారులే వీటి నిర్వాహకులు 
– మద్యం సరఫరా చేస్తున్న దుకణాలపై చర్యలు నిల్‌ 
– దుకాణాలు పూర్తిగా ఏర్పాటు కాకపోయినా 25 శాతం పెరిగిన అమ్మకాలు
- ప్లీనరీలో జగన్‌ దశలవారీ మద్య నిషేధ ప్రకటనతో బాబు సర్కారు హడావుడి
- జిల్లాలో మహిళల ఆందోళనలతో మరింత బెంబేలు
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రోత్సహించిందీ వారే ... ఆగ్రహిస్తున్నట్టుగా నటిస్తున్నదీ వారే ... ఇప్పుడు తొలగిస్తామని హడావుడి చేస్తున్నదీ ఆ వర్గమే... ఇందంతా హైడ్రామాగా అధికార పార్టీ నేతలు రక్తి కట్టించే ప్రయత్నం చేస్తున్నారని జిల్లాలోని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మద్యం పాలసీలో దాదాపు ప్రతి దుకాణానికి పట్టణాల్లో కనీసం రెండు, గ్రామీణ ప్రాంతాల్లో పది వరకు అనుబంధంగా బెల్టు షాపులు ఉండగా అధికారులు అనేక కారణాల వల్ల వాటికి జోలికి వెళ్లలేదు. పాలసీ ముగిసే చివరి రెండు నెలల్లో ప్రభుత్వం తామేదో చేస్తున్నామని చెప్పడానికి బెల్టు షాపులు పూర్తిగా నిర్మూలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త కమిషనర్‌ రాకతోపాటు ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో అధికారులు మే నెల 20వ తేదీ నుంచి జిల్లాలో బెల్టు షాపులపై దాడులు చేసి 284 కేసులు నమోదు చేసి 289 మందిని అరెస్ట్‌ చేశారు. ఇలా ఓ పక్క నమోదు చేస్తుండగానే మరో పక్క పుట్టగొడుగుల్లా ఏర్పాటవుతున్నాయి. జూలై 1వ తేదీ నుంచి మద్యం కొత్త పాలసీ (2017–19) అమల్లోకి వచ్చింది. జిల్లాలో ఏర్పాటు చేయడానికి అవకాశమున్న 545 దుకాణాలకుగాను లాటరీలో 534 దుకాణాలకు అధికారులు లైసెన్స్‌లు జారీ చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500, 220 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలన్న నిబంధన, ఇళ్లు, పాఠశాలలకు దగ్గరగా ఏర్పాటు చేయడంపై మహిళలు, స్థానికుల తీవ్ర అభ్యంతరాలతో దుకాణాల ఏర్పాటు నెమ్మదిగా సాగుతోంది. ఈ నెల 18వ తేదీ వరకు 534 దుకాణాలకుగాను 424 దుకాణాలు ఏర్పాటయ్యాయి. 
దుకాణదారులే ‘బెల్టు’ నిర్వాహకులు...
 మద్యం కొత్త పాలసీ వచ్చిన తరువాత పైన పేర్కొన్న కారణాల వల్ల దుకాణాల ఏర్పాటు ఆలస్యం కావడంతో దుకాణదారులు తమ సిబ్బందితోనే పాత దుకాణాలకు సమీపంలోని ఇళ్లు, బడ్డీ కొట్లు, ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ మద్యం విక్రయిస్తున్నారు. ఇలా 24 గంటలపాటు మద్యం అందుబాటులో ఉంచారు.
25 శాతం పెరిగిన అమ్మకాలు... 
దుకాణాలు పూర్తిగా ఏర్పాటు కాకపోయినా మద్యం అమ్మకాలు మాత్రం 25 శాతం పెరగడం బెల్టు దుకాణాలు ఏ స్థాయిలో ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవచ్చు. ఉదహరణకు రాజమహేంద్రవరం మద్యం డిపో పరిధిలో గత నెల 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు(మద్యం పాత  పాలసీ) రూ.30 కోట్ల అమ్మకాలు జరగ్గా ఈ నెల 1 నుంచి 18వ తేదీ వరకు (మద్యం కొత్త  పాలసీ) రూ.37 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ డిపో పరిధిలో రాజమహేంద్రవరం సూపరింటెండెంట్‌ పరిధిలోని ఏడు సర్కిళ్లు (రాజమహేంద్రవరం ఉత్తరం, దక్షిణం, ఆలమూరు, రాయవరం, కొరుకొండ, అడ్డతీగల, రంపచోడవరం) అమలాపురం సర్కిల్‌ పరిధిలోని రెండు (రామచంద్రపురం, కొత్తపేట) వెరసి తొమ్మిది సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలోని 229 దుకాణాలకుగాను 221 దుకాణాలకు లాటరీ తీసి లైసెన్స్‌లు జారీ చేశారు. 221 దుకాణాలకుగాను 181 దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇంకా 40 దుకాణాలు (18 శాతం) ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే గత నెల ఈ నెల 1 నుంచి 18వ తేదీకి మధ్య జరిగిన మద్యం అమ్మకాల మొత్తాన్ని పరిశీలిస్తే దాదాపు 25 శాతం పెరగడం బెల్టు దుకాణాల ఎలా ఏర్పాటు చేశారో స్పష్టమవుతోంది. 
సూత్రధారులను వదిలి పాత్రధారులపై ప్రతాపం...
ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్న 284 కేసుల నమోదు, 289 మంది అరెస్ట్‌లు కేవలం ఆ సమయంలో అక్కడ మద్యం అమ్ముతున్న వారిపై నమోదు చేసినవే. కానీ ఆయా బెల్టు షాపులు ఏర్పాటు చేసిన, చేయించిన, మద్యం సరఫరా చేసిన దుకాణదారులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు చేయాలి కాబట్టి ఏదో తూతూ మంత్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేసి రికార్టుల పరంగా ఉన్నతాధికారులుకు చూపిస్తున్నారు. కానీ నిబద్ధతతో బెల్టు షాపులు నిర్మూలించాలని క్షేత్ర స్థాయిలోని అధికారులు పని చేస్తున్న దాఖలాలు లేవు. పనిచేస్తే కాలిపోతామంటూ కొందరు ఉన్నతాధికారులే వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని అధికారులు, సిబ్బంది పని తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిబంధనల ప్రకారం మద్యం దుకాణం ఏర్పాటు, నిర్ణీత సమయంలో మాత్రమే అమ్మకాలు జరిగేలా చూడడం, బెల్టు దాకాణాల ఏర్పాటుపై ఉక్కుపాదం మోపడానికి అధికారులకు నిబద్ధత ఎంతో అవసరం.
కొత్తగా బెల్టు షాపులు ఏర్పాటయ్యాయి..
దుకాణాల ఏర్పాటు ఆలస్యం కావడంతో కొంత మంది బెల్టు షాపులు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగించారు. మే, జూన్‌ నెలల్లో బెల్టు షాపులపై దాడులు చేసి 284 కేసులు నమోదు చేశాం. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో బుధవారం నుంచే దాడులు చేస్తున్నాం. బెల్టు షాపుల ఏర్పాటుకు ప్రోత్సహించిన మద్యం వ్యాపారులు, వారికి మద్యం సరఫరా చేసే మద్యం దుకాణదారులపై కూడా ఇకపై కేసులు నమోదు చేస్తాం.
– బి. అరుణారావు, డిప్యూటీ కమిషనర్, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ, కాకినాడ
మరిన్ని వార్తలు