బెస్ట్‌ కాదు.. వరస్ట్‌!

30 Jun, 2017 02:51 IST|Sakshi
బెస్ట్‌ కాదు.. వరస్ట్‌!

బెస్ట్‌ అవేలబుల్‌ స్కూల్స్‌ ఎంపికలో అధికారుల మాయాజాలం
కనీస సదుపాయాలు లేనివి ఎంపిక  
చివరకు తాము చదువు చెప్పలేమంటూ చేతులెత్తేస్తున్న వైనం


కర్నూలు: పేద దళిత విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను ఉచితంగా అందించేందుకు ఉద్దేశించిన బెస్ట్‌ అవేలబుల్‌ స్కూల్స్‌ పథకాన్ని అధికారుల అవినీతి, ప్రభుత్వం నిర్లక్ష్యం కలిసి వరస్ట్‌ అవేలబుల్‌ స్సూల్స్‌గా మార్చేస్తున్నారు. పాఠశాలల ఎంపికలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కనీస సదుపాయాలు లేని వాటిని ఎంపిక చేసి విద్యార్థుల ఆశలను చిదిమేస్తున్నారు. కనీసం పిల్లలు పడుకునేందుకు మంచాలు కూడా లేని పాఠశాలలను ఎంపిక చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఒక్కో రెసిడెన్షియల్‌ విద్యార్థికి రూ.30 వేల ప్రకారం చెల్లిస్తోంది. అయితే, పాఠశాలల ఎంపికలో అధికారులు అమ్యామ్యాలు తీసుకుని అవకతవకలకు పాల్పడ్డారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కార్పొరేట్‌ పాఠశాలలు కాకుండా కేవలం ప్రైవేటు పాఠశాలల్లోనే ప్రవేశాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఒక్కో పాఠశాల నుంచి కనీసం రూ. 50 వేల చొప్పున వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సదుపాయాలు లేకపోయినా..
వాస్తవానికి ఈ పథకం కింద ఎంపిక చేసేందుకు ముందుగా ఆసక్తి ఉన్న పాఠశాలలను ఆహ్వానిస్తారు. ముందుకు వచ్చిన పాఠశాలల్లో సదుపాయాలను అధికారులు  స్వయంగా పరిశీలించాల్సి ఉంటుంది. అన్ని సదుపాయాలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే ఈ పథకం కింద విద్యార్థులను చేర్పించేందుకు అధికారుల కమిటీ అంగీకరించాల్సి ఉంటుంది. అయితే, జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలను గమనిస్తే కనీస సదుపాయాలు లేకపోయినప్పటికీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు.. బనగానపల్లెలోని నెహ్రూ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలను   ఎంపిక చేశారు. ఇందులో 40 మంది ఒకటో తరగతి విద్యార్థులను డే–స్కాలర్స్‌గా, 5వ తరగతి విద్యార్థులు 30 మందిని రెసిడెన్షియల్‌ పద్ధతిలో చేర్చుకుంటామని యాజమాన్యం అంగీకరించింది. ఇందుకు అధికారులు కూడా గుడ్డిగా తలూపారు. ఈ పాఠశాలలో విద్యార్థులను చేర్చేందుకు రంగం సిద్ధం చేశారు.

తీరా అడ్మిషన్ల సమయంలో మరో అధికారి విచారణ చేసే సమయానికి తమ పాఠశాలలో రెసిడెన్షియల్‌ విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు లేవని యాజమాన్యం పేర్కొనడం చర్చనీయాంశమవుతోంది. అంటే అక్కడ విద్యార్థులు ఉండేందుకు మంచాలు, రూములు ఉన్నాయో? లేవో కూడా చూడకుండానే సాంఘిక సంక్షేమ, విద్యాశాఖ అధికారులు అనుమతులు ఇచ్చేసినట్టు తెలుస్తోంది. జిల్లాలో ఎంపిక చేసిన మరో ఐదు పాఠశాలల్లోనూ ఇదే వ్యవహారం నడిచినట్టు సమాచారం. అడ్మిషన్లకు రేటు కట్టి మరీ అధికారులు అమ్యామ్యాలు మేసినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

నీరుగారుతున్న పథకం
పేద దళిత విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్‌ విద్యను అందించేందుకు గానూ అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 2008 మే 31న ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీచేశారు. దీన్ని అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్‌ చైర్మన్‌గా, డీఈవో, సాంఘిక సంక్షేమశాఖ డీడీ, ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ సొసైటీ స్కూల్స్‌ ప్రిన్సిపల్‌ కన్వీనర్‌గా కమిటీ ఏర్పాటు చేశారు. అయితే, పాఠశాలల ఎంపికలో అటు సాంఘిక సంక్షేమ శాఖ, ఇటు విద్యాశాఖ అధికారులు శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. జిల్లాలో మాత్రం ఉన్నతాధికారులు తనిఖీ చేయకుండానే పాఠశాలలను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఫలితంగా ఈ పథకం లక్ష్యం నీరుగారిపోతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు