పేదలకు మెరుగైన వైద్యం అందించాలి

29 Jul, 2017 22:31 IST|Sakshi
పేదలకు మెరుగైన వైద్యం అందించాలి
ఆస్పత్రి అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక
ప్రత్యేకాధికారుల నియామకం
కాకినాడ వైద్యం (కాకినాడ సిటీ):  నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు వైద్యులందరూ సమష్టిగా పని చేయాలని   కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా కోరారు.  శనివారం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో సూపరింటెండెంట్‌ ఛాంబర్‌లో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ (హెచ్‌డీఎస్‌), వార్డుల విభాగాధిపతుల సమావేశంలో మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల నుంచి లక్షలాది మంది ప్రజలు జీజీహెచ్‌లో వైద్యం పొందేందుకు వస్తున్నారని, వీరికి సకాలంలో వైద్య చికిత్స అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే తక్షణమే ప్రభుత్వ దృష్టికి తీసుకెళతామన్నారు. పెరుగుతున్న జనాభాకనుగుణంగా ఆస్పత్రి అభివృద్ధి, వైద్య పరికరాలు, సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధుల మంజూరు, విధాన పరమైన నిర్ణయాల అమలుకు కలెక్టర్‌గా తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ సేవలను మరింత విస్త్రుతం చేయాలని కోరారు. సమాజంలో వైద్యులకు ఉన్న గుర్తింపు మరెవరికి లేదన్నారు. ప్రభుత్వ సేవకులుగా ప్రజలు మెచ్చేలా సర్వజనులకు వైద్యం అందించాల్సిన అవశ్యకత ఉందన్నారు. క్యాజువాలిటీకి రోగికి సంబంధిత వైద్య నిపుణులు పరిశీలించి చికిత్స అందించి, గంటలోపు అత్యవసర చికిత్స అందించి ఎమర్జెన్సీగా ఐసీయూ, వార్డులోకి తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, హౌస్‌సర్జన్లు, ఇంటర్న్‌లు,నర్సుల సమర్థ పనితీరుకు విధిగా ఈ బయోమెట్రిక్‌ హాజరు వి«ధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఈ విధానంలో సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆస్పత్రిలో నెలకొన్న మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను నెలకోసారి పర్యవేక్షించాలని జేసీని ఆదేశించారు.
మూడు నెలలకోసారి హెచ్‌డీసీ సమావేశం
జీజీహెచ్‌లో ప్రతీ మూడు నెలలకోసారి తప్పకుండా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. హెచ్‌డీఎస్‌ ఎప్పుడు జరిగిందని ప్రశ్నించారు. మార్చి 3, 2016 సంవత్సరంలో జరిగిందని సిబ్బంది బదులివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచిపద్ధతి కాదన్నారు.ఇక నుంచి ప్రతీ మూడునెలలకు సమావేశం జరగాలని ఆదేశాశించారు. నెలకోసారి జేసీ సంబంధిత హెచ్‌ఓడీలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.హెచ్‌డీఎస్‌లో  ఇతర సభ్యుల నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.    
ప్రత్యేకాధికారుల నియామకం
జీజీహెచ్‌లో వైద్య చికిత్సల కోసం వస్తున్న రోగులకు సత్వరంగా వైద్య సేవలందించేందుకు జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పరిపాలనా సౌలభ్యం, జవాబుదారీతనం పెంపొందింపు, సేవల సరళీకృతం కోసం ప్రత్యేకాధికారులను నియమించారు.ఆసుపత్రిలో ఉన్న సుమారు 21వార్డులకు ఉన్న 14 మంది విభాగాధిపతులకు బాధ్యతలు అప్పగించారు. ఎమర్జన్సీ వార్డులోని క్యాజువాలిటీకి ప్రత్యేకాధికారిగా సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ మూర్తి, శానిటేషన్‌కు అసిస్టెంట్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ ప్రసాద్,ఆపరేషన్‌ ధియేటర్, జీజీహెచ్‌లో ఉన్న 8 ఐసీయూలు, సెంట్రల్‌ ల్యాబ్‌ వంటి విభాగాలకు ఒక్కో ప్రత్యేకాధికారులను కలెక్టర్‌ నియమించారు.
సమాచారం అందివ్వండి 
రోగులకు మెరుగైన సేవలు అందించడం,వైద్య సదుపాయాల కల్పన కోసం ఆసుపత్రిలో లభిస్తున్న వైద్య సేవలు, యూనిట్ల,వైద్య పరికరాలు,వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, డ్రగ్స్‌ కొరతపై తక్షణమే రిపోర్టు తయారు చేసి తనకందజేయాలని కలెక్టర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాఘవేంద్రరావును ఆదేశించారు. 
ఆదాయ వనరులను సద్వినియోగం చేసుకోవాలి
ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ఆదాయ వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. ఏటా లక్షల్లో ఆదాయం వచ్చే సైకిల్‌ స్టాండ్‌ ఏర్పాటుకి ఉన్న అడ్డంకులు, రీటెండర్‌కు తక్షణమే చర్యలు తీసుకోవాలని జేసీ డాక్టర్‌ మలిఖార్జున్‌ని ఆదేశించారు. ఆసుపత్రికి ఆదాయం రాకుండా ఉన్న ఇతర వాటిపై సమగ్ర రిపోర్టు తయారు చేసి తనకందివ్వాలని ఆదేశించారు. 
టెస్ట్‌లో జాప్యం తగదు
రంగరాయ మెడికల్‌ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్‌ లేబోరేటరీస్‌లో వైద్యులు సిపారసు చేసిన రోగ నిర్థారణ పరీక్షలు తీవ్ర జాప్యం చేసుకోవడంపై కలెక్టర్‌ ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ని ప్రశ్నించారు. టెస్ట్‌ల అనంతరం రిపోర్టు జారీ చేసేందుకు అయ్యే సమయాన్ని నిర్ణయించి , ఆవిధంగా రిపోర్టుల జారీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.
పరికరాల పరిస్థితిపై రెండు వారాలకోసారి రిపోర్టు ఇవ్వాలి 
రేడియాలజీలో ఉన్న పరికరాలతో పాటూ ఆసుపత్రిలో ఉన్న అన్ని రకాల వైద్య పరికరాలపై ప్రతీ పదిహేను రోజులకోసారి వాస్తవ పరిస్థితిని వివరిస్తూ రిపోర్టు అందజేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమన్నారు.
నిపుణులు అందుబాటులో ఉండాలి
ప్రెగ్నెన్సీ మహిళల ఆరోగ్య భద్రతరీత్యా గైనిక్‌ వార్డులో వైద్య నిపుణులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. హైరిస్క్,క్రిటికల్‌ ప్రెగ్నెన్సీ  కేసులన్నీ జీజీహెచ్‌లోకి వస్తాయన్నారు.ఈ సమయంలో మిడ్‌వైఫ్‌లపైనే భారం వేయడం తగదని, నిపుణులు అందుబాటులో ఉండి తక్షణ చికిత్స అందించాలని కోరారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్‌ ఏ మల్లిఖార్జున్, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఆనంద్, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు, ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహాలక్ష్మిలతో పాటూ హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు