ఇంద్రకీలాద్రిపై పండుగ శోభ

13 Oct, 2015 10:02 IST|Sakshi

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం నుంచి వైభవంగా ప్రారంభం అయ్యాయి. కన్నులపండువగా జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆలయ ప్రాంగణాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. మొదటి రోజు అమ్మవారు శ్రీ స్వర్ణకవచలాంకృత దేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుండి కఠోర దీక్షతో భవాని మాలలు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. 

దసరా ఉత్సవాలతో బెజవాడకు పండుగ శోభ సంతరించుకుంది. నగరంలోని  ప్రధాన రహదారులన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పది రోజుల పాటు అమ్మవారు పది అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో నిత్యం లక్ష కుంకుమార్చన, చండీయాగాల్లో భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది.

అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు సర్వదర్శనంతోపాటు రూ.50, రూ.100 టికెట్లను, వీఐపీలకు రూ.300 టికెట్లను విక్రయిస్తున్నారు. తొలిసారిగా ఈ ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ పది రోజులు రోజుకు పదివేలమందికి అన్నదానం చేయనున్నారు. భక్తులకు విక్రయించేందుకు 23 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిటీలో అన్నిప్రాంతాల నుండి అమ్మవారిని దర్శించుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ఉచిత బస్సులను ఏర్పాటుచేశాయి. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని 10 రోజుల పాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. చివరి రోజున కృష్ణా నదిలో హంసవాహనంపై ఊరేగడంతో ఉత్సవాలు ముగుస్తాయి.    

మరిన్ని వార్తలు