అందరి బంధువయా.. భద్రాచల రామయ్యా!

3 Apr, 2017 23:21 IST|Sakshi
  • రాష్ట్ర సరిహద్దుల్లో మొదలైన రాములోరి పెళ్లి సందడి
  • విద్యుదీపకాంతులీనుతున్న భద్రాద్రి రామాలయం
  • రేపే సీతారాముల కల్యాణం
  • 6నశ్రీరామ పట్టాభిషేకం స్వామివారి కల్యాణానికి సర్వం సిద్ధం
  • నెల్లిపాక :
    రాష్ట్ర సరిహద్దున ఉన్న భద్రాద్రిలో శ్రీసీతారాములవారి పెళ్లి సందడి నెలకొంది. ఈనెల ఐదో తేదీన శ్రీరామనవమి రోజున స్వామి వారి కల్యాణం, 6న శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిగో భద్రాద్రి.. గౌతమి అదిగో చూడండి...అంటూ శ్రీరామదాసు పిలుపునందుకుని శ్రీసీతారాముల కల్యాణానికి భక్తులు తరలిరానున్నారు. శ్రీరామనవమి అంటే చాలు భక్తిపారవశ్యంతో పులకించే ఉభయగోదావరి జిల్లాల నుంచే వేలాది మంది భక్తులు భద్రాద్రికి ఏటా వస్తుంటారు. రామయ్య పెళ్లి వేడుకల్లో అన్నీ తామై ముందుంటారు. గోటితో వలిచిన తలంబ్రాల తయారీ, పెండ్లి తంతులో ఉపయోగించే కొబ్బరి బొండాలు భద్రాద్రి శ్రీసీతారాముల కల్యాణానికి భక్తులు ఉభయగోదావరి జిల్లాల నుంచే తీసుకొస్తుంటారు. 
    సర్వాంగసుందరంగా భద్రాచలం..
    ఈ ఏడాది జరిగే వేడుకలకు భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. స్వామివారి కల్యాణానికి లక్షకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. మిథిలా స్టేడియాన్ని సుందరంగ అలంకరించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం  తెలుగు రాష్ట్రాల్లో వందలాది ప్రత్యేక బస్సులను నడపనుంది. ఇప్పటికే వందలాది మంది భక్తులు పాదయాత్రతో భద్రాద్రి చేరుకున్నారు. 
    వేగంగా లడ్డూ ప్రసాద తయారీ
    శ్రీరామనవవిుకు 1.50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని భావించి వారందరికీ మూడు లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు గాను లడ్డూల తయారీ స్థానిక చిత్రకూట మండపంలో వేగంగా జరుగుతోంది. శ్రీరామనవమి నాటికి మూడు లక్షల లడ్డూలతో పాటు ముత్యాల తలంబ్రాలను తయారీను అధికారులు వేగవంతం చేశారు.
     
    లడ్డూలు, తలంబ్రాలకు ప్రత్యేక కౌంటర్లు
    ఈ ఏడాది భద్రాచలం వచ్చిన ప్రతి భక్తునికీ లడ్డూలతో పాటు స్వామి వారి తలంబ్రాలను అందించాలని ఆ రాష్ట్ర మంత్రి తుమ్మల, జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రత్యేక తలంబ్రాల కౌంటర్‌లను ఏర్పాటు చేస్తున్నారు. కోర్టు ప్రాంగణం, కాపా లక్ష్మమ్మ సొసైటీ స్థలంతో పాటు పలు చోట్ల ఈ కౌంటర్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. 
     
మరిన్ని వార్తలు