చకచకా ‘భగీరథ’

6 Sep, 2017 11:17 IST|Sakshi
చకచకా ‘భగీరథ’

పాలేరు సెగ్మెంట్‌లో పూర్తికావొచ్చిన పనులు
రూ.578కోట్ల వ్యయంతో నిర్మాణాలు
7.20లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు


కూసుమంచి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు చకచకా సాగుతున్నాయి. ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించాలనే ఉద్దేశంతో పాలేరు సెగ్మెంట్‌లో చేపట్టిన పనులు మరో రెండు నెలల్లో పూర్తి కానున్నాయి. పాలేరు రిజర్వాయర్‌ నీటి ఆధారంగా రూ.578కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. పనులన్నీ సక్రమంగా పూర్తయితే 370 ఆవాస గ్రామాలతోపాటు ఖమ్మం నగరంతో కలిపి మొత్తం 7.20లక్షల మందికి రోజుకు ఒక్కొక్కరికి 100 లీటర్ల చొప్పున శుద్ధి చేసిన జలాలను నల్లాల ద్వారా సరఫరా చేయనున్నారు. దీంతో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందనుంది. జిల్లాలో చేపట్టిన మిషన్‌ భగీరథ పనుల్లో పాలేరు సెగ్మెంట్‌ పనులు ముందంజలో ఉండగా.. ఇటీవల పాలేరులో నిర్మించిన ఇన్‌టేక్‌వెల్‌ పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలించిన విషయం విదితమే. కాగా.. భగీరథ పనులను ఏప్రిల్‌లోగా పూర్తి చేసి సెగ్మెంట్‌లోని అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

తుది దశకు ఇన్‌టేక్‌వెల్‌..
మిషన్‌ భగీరథ ద్వారా పాలేరు సెగ్మెంట్‌లో ప్రజలకు తాగునీరు అందించేందుకు రిజర్వాయర్‌ వద్ద భారీ ఇన్‌టేక్‌వెల్‌ నిర్మించారు. దీని పనులు పూర్తికాగా.. అందులో మోటార్లు అమర్చటమే మిగిలి ఉంది. వాటిని వచ్చే నెలలో పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కాగా.. పథకం కొరకు ప్రత్యేకంగా విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మించగా.. ఆ పనులు పూర్తయ్యాయి. ఇన్‌టేక్‌వెల్‌(బావి) నిర్మాణం 55 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు, 14 అడుగుల ఎత్తుతో చేపట్టారు. ఇందుకోసం అత్యాధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ ఇన్‌టేక్‌వెల్‌ నుంచి ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్‌ జిల్లాల్లో నిర్మించే పథకాలకు పాలేరు నీటిని సరఫరా చేయనున్నారు.

జీళ్లచెరువులో హెడ్‌వర్క్స్‌ పనులు
మిషన్‌ భగీరథ పాలేరు సెగ్మెంట్‌లో భాగంగా జీళ్లచెరువు శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో పథకం నిర్మాణాలు చేపట్టారు. పనులను 2015 నవంబర్‌లో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఆయా పనుల్లో భాగంగా రోజుకు 90 ఎంఎల్‌టీ(మిలియన్‌ లీటర్లు) నీటిని సరఫరా చేసే సామర్థ్యంతో భారీ ఆర్‌ఎస్‌ఎఫ్‌(ర్యాపిడ్‌ శాండ్‌ ఫిల్టర్‌ హౌస్‌) నిర్మాణం చేపట్టగా.. పనులు పూర్తికావొచ్చాయి. దీంతోపాటు 4 ఫ్యాక్యులేటర్లు, ఏరియోటర్‌ పనులు కూడా పూర్తయ్యాయి. జీళ్లచెరువులోని గుట్టపైన తాగునీటి సరఫరా కోసం 1000, 500, 250కేఎల్‌ సామర్థ్యంలో మూడు జీఎల్‌బీఆర్‌ ట్యాంకులు నిర్మిస్తుండగా.. వాటి పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు నేలకొండపల్లి, కూసుమంచి, రఘునాథపాలెం మండలాల్లో మరో 8 భారీ ఓహెచ్‌బీఆర్, జీఎల్‌బీఆర్‌(ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు) నిర్మాణాలు పూర్తికాగా.. మెయిన్, సబ్‌ పైపులైన్‌ పనులు çకూడా పూర్తయ్యాయి. కాగా.. గ్రామాల్లో అంతర్గత పైపులైన్‌ నిర్మాణాల పనులు కొనసాగుతున్నాయి.

స్వచ్ఛమైన నీరు..
మిషన్‌ భగీరథ పాలేరు సెగ్మెంట్‌ నుంచి కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్, ముదిగొండ, రఘునాథపాలెం మండలాల్లోని 370 గ్రామాల ప్రజలతోపాటు ఖమ్మం నగరవాసులకు మొత్తంగా 7.20లక్షల మందికి ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు ఈ పథకాన్ని చేపట్టారు. పనులు నిర్ణీత గడువుకంటే ముందుగానే జిల్లాలో తొలుత పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్ణయించగా.. ఈ మేరకు అధికారులు, కాంట్రాక్టు పనులు చేపట్టిన సంస్థల సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. రెండు జిల్లాల్లో తొలుత పాలేరు నియోజకవర్గంలోనే ఇంటింటికీ నల్లా నీరు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రతి ఇంటికి నల్లాలను బిగించే కార్యక్రమం శరవేగంగా సాగుతుండగా.. ఇప్పటికే 55 గ్రామాల్లో పనులు పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు