భజన మండళ్లు ఆధ్యాత్మిక ప్రచారకులు

26 Jul, 2016 00:02 IST|Sakshi
భజన మండళ్లు ఆధ్యాత్మిక ప్రచారకులు

తిరుపతి కల్చరల్‌:  శ్రీవారి వైభవాన్ని  విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసే  భజన మండళ్లు ఆధ్యాత్మిక ప్రచారకులని  దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు.  మంత్రాలయ మఠం గురుసార్వభౌమ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీవారి మెట్లోత్సవ వేడుకలను మహతి కళాక్షేత్రంలో  సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  మంత్రి పాల్గొని  వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  భక్త భజన మండళ్లు  తమ గ్రామాల్లో  శ్రీవారి వైభవాన్ని విస్తృతంగా ప్రచారం సాగించి ఆధ్యాత్మిక సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు.  అనంతరం  మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామిజీ మెట్లోత్సవం విశిష్టతను  వివరించారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రం నుంచి విచ్చేసిన 150 భక్త భజన మండళ్లు నగర సంకీర్తన, సామూహిక భజనలు నిర్వహించారు.  గురుసార్వభౌమ దాస సాహిత్య ప్రాజెక్టు డైరెక్టర్‌ అబ్బన్న ఆచార్యులు మాట్లాడుతూ ప్రాజెక్టు ద్వారా సుమారు వెయ్యి భజన మండళ్లును ఏర్పాటుచేసి నిత్యం సనాతన ధర్మ ప్రచారానికి  కృషి చేస్తున్నామన్నారు. మొదటిసారిగా శ్రీవారి మెట్లోత్సవం నిర్వహించడం మహద్భాగ్యంగా భావిస్తున్నామన్నారు. మంగళవారం ఉదయం 4.30 గంటలకు శ్రీవారి మెట్ల వద్ద  మెట్లోత్సవం ప్రారంభించి నామసంకీర్తనలతో   తిరుమలగిరులను అధిరోహించనున్నట్లు తెలిపారు. అనంతరం బుధవారం  తిరుపతిలోని మూడవ సత్రంలో ఉదయం భజనలు, యోగా, భక్త మండళ్లకు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ  బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, బీజేపీ నేత గుండాల గోపీనాథ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు